బందా: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

మావు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం సంఘటన జరిగితే శుక్రవారం సాయంత్రం కేసు నమోదైంది. తన కుటుంబ సభ్యులొకరితో మహిళ తమ బంధువుల ఇంటికి వెళ్తూ మధ్యలో ఆగింది.  కుటుంబ సభ్యుడిని దుండగులు చెట్టుకు కట్టేసి మహిళపై అత్యాచారం చేశారు.

అత్యాచారానికి సంబంధించిన వీడియో క్లిప్ 14 సెకన్లు ఉందని పోలీసులు చెబుతున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేశామని, మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించామని అంటున్నారు. 

అయితే, పోలీసుల తీరుపై విమర్శలు ఎదురవుతున్నాయి. తాను పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే తనను అక్కడి అధికారులు కొట్టారని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారని చెబుతోంది. వీడియో వైరల్ కావడంతో పోలీసు సూపరింటిండెంట్ జోక్యం చేసుకున్నారు. దాంతో నిందితులపై కేసు నమోదు చేశారు.