నా గ్రామానికి ఎప్పటికీ తిరిగి వెళ్లను.. ఇప్పటికీ ప్రాణభయం ఉంది: సామూహిక అత్యాచార బాధితురాలి ఆవేదన
సామూహిక అత్యాచారానికి గురైన ఓ మహిళ పదేళ్ల పాటు న్యాయ పోరాటం చేసింది. ఆ పోరాటంలో విజయం సాధించింది. అయితే తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు మాత్రం ఇప్పటికీ భయపడిపోతుంది.
న్యూఢిల్లీ: సామూహిక అత్యాచారానికి గురైన ఓ మహిళ పదేళ్ల పాటు న్యాయ పోరాటం చేసింది. ఆ పోరాటంలో విజయం సాధించింది. అయితే తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు మాత్రం ఇప్పటికీ భయపడిపోతుంది. తన, తన పిల్లల జీవితాల గురించి భయపడి తన గ్రామానికి తిరిగి వెళ్లలేనని ఆమె చెబుతోంది. వివరాలు.. 2013 ముజఫర్‌నగర్ అల్లర్ల సమయంలో షమీమా (పేరు మార్చబడింది) సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ కేసులో దోషులుగా తేలిన ఇద్దరు వ్యక్తులు మహేశ్‌వీర్, సికిందర్‌లకు ముజఫర్‌నగర్‌లోని జిల్లా కోర్టు మంగళవారం 20 సంవత్సరాల జైలు శిక్ష ఖరారు చేసింది. ఒక్కొక్కరికి రూ.15,000 జరిమానా కూడా విధించింది.
అయితే ఈ పరిణామాలపై బాధిత మహిళ మాట్లాడుతూ.. ‘‘వారు (ఇద్దరు దోషులు) కటకటాల వెనుక ఉన్నారు. కానీ వారి కుటుంబం ఇప్పటికీ మమ్మల్ని బెదిరిస్తుంది, భయపెడుతుంది... నేను ఎప్పటికీ తిరిగి వెళ్లను. నా గురించి, నా పిల్లల కోసం నేను భయపడుతున్నాను’’ అని చెప్పారు. ఇక, తనకు జరిగిన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్న షమీమా.. ఆ రోజు తాను ఇంటిపనులతో తీరిక లేకుండా ఉన్నానని చెప్పింది. అయితే ఒక ముస్లిం పురుషుడు, హిందూ స్త్రీకి సంబంధించిన సంఘటనపై వందతులు వ్యాప్తి చెందడంతో జాట్ కమ్యూనిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారనే నివేదికల తర్వాత పరిస్థితుల్లో ఉద్రిక్తత స్పష్టంగా కనిపించిందని తెలిపింది.
అయితే హత్యలు మొదలయ్యాయనే ప్రచారం జరిగిందని.. గ్రామం విడిచిపెట్టి వెళ్లాలని తనకు కొందరు సలహా ఇచ్చారని పేర్కొంది. తాను తన ఇద్దరు పిల్లలతో కలిసి పరిగెత్తానని గుర్తుచేసుకుంది. తాను పొలాల గుండా పరిగెత్తానని.. కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియలేదని తెలిపింది. అయితే తాను దారితప్పిపోయి.. పట్టుబడ్డానని చెప్పింది. పురుషులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. తనపై అత్యాచారం జరుగుతున్నప్పుడు తన పక్కనే మూడు నెలల చిన్నారి ఉందని.. సహకరించాలని లేదంటే నా పిల్లలను చంపేస్తామని వారు బెదిరింపులకు పాల్పడినట్టుగా నాటి సంగతులను గుర్తుచేసుకుంటూ షమీమా తన బాధను వ్యక్తం చేసింది.
తనకు జరిగిన ఘటనపై న్యాయం కోసం 10 ఏళ్ల పాటు తాను చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకున్న షమీమా.. దోషుల తరఫు న్యాయవాదులు తన పాత్రను ప్రశ్నించారని, తనను అవమానించారని ఆరోపించారు. ‘‘గత దశాబ్దం కాలంలో దోషుల తరపు న్యాయవాదులు నా పాత్రను ప్రశ్నించారు. నా భర్తను నేను అతని భార్యానా? కాదా? అని అడిగారు. వారు నన్ను కేసును ఉపసంహరించుకోవాలని కోరుకున్నారు. అయితే నేను ఏది ఏమైనా న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాను’’ అని షమీమా తెలిపింది. అయితే తొలుత ప్రాణాలతో బయటపడిన తనకు నేరం గురించి నివేదించే ధైర్యం లేదని చెప్పింది. అయితే తనతో పాటు మరో ఆరుగురు లైంగిక వేధింపుల బాధితులను సామాజిక కార్యకర్త షబ్నం హష్మీ సంప్రదించారని.. ఆమె సీనియర్ న్యాయవాది బృందా గ్రోవర్‌తో టచ్‌లో ఉంచారని తెలిపింది.
‘‘గ్యాంగ్‌రేప్‌లో బతికిన ఏడుగురిలో ఆరుగురు వెనక్కి తగ్గారు, అయితే ఆమె (షమీమా) బలంగా ఉండి.. ఈ సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత గెలిచింది’’ అని యాక్ట్ నౌ ఫర్ హార్మొనీ అండ్ డెమోక్రసీ వ్యవస్థాపక ధర్మకర్త హష్మీ చెప్పారు. ఇక, 2013లో ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో హిందూ, ముస్లిం వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 60 మందికి పైగా మరణించగా.. 50,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు.