భారతదేశంలో కరోనా విలయానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వచ్చే ఆరు నెలల పాటు మాస్కులు ధరించడం తప్పనిసరని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే స్పష్టం చేశారు.

వైరస్ వ్యాప్తి కట్టడి కోసం రాత్రి పూట క‌ర్ఫ్యూ లేదా లాక్‌డౌన్‌లు విధించాల‌ని నిపుణులు చెబుతున్నప్పటికీ ఆ దిశగా తాము ఆలోచనలు చేయడంలేదని సీఎం క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రంలో కొవిడ్ నియంత్ర‌ణ‌లో ఉన్న కార‌ణంగా తాను లాక్ డౌన్ కు అంగీక‌రించలేద‌ని ఉద్ధవ్ చెప్పారు. నివారణ కంటే ముందు జాగ్రత్త ఎంతో ఉత్తమమన్న ఉద్ధవ్ థాక్రే.. పబ్లిక్‌ ప్రదేశాలలో మాస్కులను ధరించటం అలవాటుగా మార్చుకోవాలని సూచించారు.

ప్రజలు తప్పని సరిగా మరో ఆరు నెలల పాటు మాస్కులు పెట్టుకోవాలన్నారు. కాగా, శ‌నివారం మ‌హారాష్ట్ర‌లో 3940 కేసులు న‌మోద‌య్యాయి. 74 మంది మరణించారు. కేసులు, మ‌ర‌ణాల సంఖ్య‌లో దేశంలో మ‌హారాష్ట్ర‌నే తొలి స్థానంలో ఉంది. అక్కడ మొత్తం కేసులు 19 లక్షలకు, మరణాలు 49వేలకు చేరువయ్యాయి.