Vote from Home : ‘‘ ఇంటి నుంచే ఓటు’’ కు ఎవరెవరు అర్హులు .. దరఖాస్తు , ఓటు ఎలా వేయాలి .. పూర్తి వివరాలు ఇవిగో
కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్‌లోని 27 ఏ కింద 80 ఏళ్లు వయసు నిండిన వారికి, 40 శాతం పైగా అంగవైకల్యం వున్న వారికి పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం 80 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులు ... నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి పోలింగ్‌కు ఐదు రోజుల ముందే ఫారం 12 డీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఓటు ఫ్రమ్ హోమ్ ద్వారా ఓటు వేసే వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తారు. ఈ ఓట్లను ఆర్వో వద్ద భద్రపరుస్తారు. కౌంటింగ్ రోజున ఇతర ఓట్ల మాదిరిగానే ఈ ఓట్లను లెక్కిస్తారు. తొలిసారి ఓటు వేసే విధానాన్ని ఎన్నికల సంఘం భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చింది.
లోక్‌సభ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే ‘‘ Vote From Home ’’ అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలో 85 ఏళ్లు వయసు నిండిన వారు 82 లక్షలు.. 88.4 లక్షల మంది నమోదైన దివ్యాంగులు వున్నట్లు ఈసీ తెలిపింది. వీరంతా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేందుకు వ్యయ ప్రయాసలు పడాల్సి వస్తోంది. దీనిని గమనించిన కేంద్ర ఎన్నికల సంఘం.. కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్‌లోని 27 ఏ కింద 80 ఏళ్లు వయసు నిండిన వారికి, 40 శాతం పైగా అంగవైకల్యం వున్న వారికి పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇంటి నుంచి ఎలా ఓటు వేస్తారంటే :
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం 80 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులు ... నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి పోలింగ్‌కు ఐదు రోజుల ముందే ఫారం 12 డీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనిని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కానీ, సహాయ రిటర్నింగ్ అధికారికి కాని పంపాలి. తమ పూర్తి చిరునామా, సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్‌ను కూడా దరఖాస్తులో పొందుపరచాలి.
ఈసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలు దరఖాస్తు చేసుకున్న వారు అర్హులా ..? కాదా..? అనేది తేలుస్తారు. ఆ తర్వాతే పోలింగ్ జరిగే రోజున ఫారం 12డీ తీసుకుని, ఎన్నికల సిబ్బంది వారి ఇంటికి వెళ్తారు. బ్యాలెట్ పేపర్ వారికి ఇచ్చి ఓటు వేయిస్తారు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అంతేకాదు.. ఈ ప్రక్రియను వీడియో తీసి ఈసీకి సమర్పిస్తారు. పోలింగ్ సిబ్బందితో పాటు రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్లు కూడా వారి వెంట వుంటారు. ఓటు ఫ్రమ్ హోమ్ ద్వారా ఓటు వేసే వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తారు. ఈ ఓట్లను ఆర్వో వద్ద భద్రపరుస్తారు. కౌంటింగ్ రోజున ఇతర ఓట్ల మాదిరిగానే ఈ ఓట్లను లెక్కిస్తారు.
బీహార్‌లో తొలిసారిగా ఓటు ఫ్రమ్ హోమ్ :
తొలిసారి ఓటు వేసే విధానాన్ని ఎన్నికల సంఘం భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటి వద్ద ఓటు తీసుకున్నా.. ఓటర్లు ఎవరికి ఓటు వేస్తున్నారన్నది రహస్యంగా వుంచేందుకు పోలింగ్ బూత్‌లో లాంటి ఏర్పాట్లే ఇళ్ల వద్దా చేయనున్నారు.
తెలంగాణలో మే 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 85 ఏళ్లు నిండిన వారికి హోం ఓటింగ్ సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. హోం ఓటింగ్ కోసం దరఖాస్తులు తీసుకుంటున్నామని, మరో మూడ్రోజుల్లో ఈ ప్రక్రియ మొదలుపెడతామని వికాస్ రాజ్ అన్నారు. రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సి వుంటుందని ఆయన ప్రజలకు తెలిపారు.