ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో ఇక దోమల బెడద వుండదు ... ఇందుకోసం ఏం చేస్తున్నారో తెలుసాా?

మహాకుంభ్ 2025లో భక్తుల ఆరోగ్యానికి ప్రాధాన్యత. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన కుంభమేళా కోసం వెక్టర్ కంట్రోల్ యూనిట్ ఏర్పాటు. దోమలు, ఈగల బెడద లేకుండా చూస్తారు.

Venctor control unit to be deployed for insect free prayagraj Mahakumbh Mela 2024 AKP

ప్రయాగరాజ్ మహా కుంభమేళా : దేశ నలుమూలల నుండే కాదు విదేశాల నుండి కూడా ప్రయాగరాజ్ మహా కుంభమేళాకు భక్తులు తరలివస్తుంటారు. తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చే ఈ కుంభమేళాలో స్వచ్ఛతకు ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆకాంక్ష మేరకు మహా కుంభమేళాను స్వచ్ఛంగా, ఆరోగ్యంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 

కుంభమేళా ప్రాంతాన్ని ఈగలు, దోమలు వంటి కీటకాల నుండి కాపాడేందుకు వెక్టర్ కంట్రోల్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ యూనిట్ మహా కుంభమేళా మొత్తాన్ని కీటకాల బారి నుండి కాపాడుతుంది. దోమల వల్ల వచ్చే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధుల నుండి భక్తులకు రక్షణ కల్పిస్తుంది. ఈగల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది.

వెక్టర్ కంట్రోల్ ప్రణాళిక సిద్ధం

మహా కుంభమేళాకు వచ్చే కోట్లాది మంది భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని యోగి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. వెక్టర్ కంట్రోల్ యూనిట్ ఏర్పాటు ఇందులో భాగమే. మేళా ప్రాంతంలో పెద్ద ఎత్తున శానిటైజేషన్ చేపట్టనున్నారు.

మహా కుంభమేళా నోడల్ జాయింట్ డైరెక్టర్ (వెక్టర్ కంట్రోల్) డాక్టర్ విపి సింగ్ మాట్లాడుతూ... ఈ కుంభమేళా ప్రాంతమంతా క్రిమిసంహారక మందులు చల్లుతామని చెప్పారు. మేళా ప్రాంతాన్ని 5 జోన్లుగా విభజించినట్లు.... ప్రతి జోన్‌లో 5 సెక్టార్ల చొప్పున మొత్తం 25 సెక్టార్లు ఉన్నాయన్నారు. ప్రతి సెక్టార్‌కు అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ (AMO) బాధ్యత వహిస్తారని తెలిపారు. అన్ని సెక్టార్లలో కలిపి 35 శానిటేషన్ సర్కిళ్లు ఉన్నాయని.. ప్రతి సర్కిల్‌లో మలేరియా ఇన్స్పెక్టర్లు పనిచేస్తారన్నారు.

పార్కింగ్ స్థలాల్లో కూడా శుభ్రత

ప్రతి జోన్‌లో ఒక సబ్ స్టోర్ ఉంటుంది... అక్కడ మూడు రోజులకు సరిపడా నిల్వలు ఉంటాయని విపి సింగ్ తెలిపారు. అక్కడి నుండి వివిధ సర్కిళ్లకు క్రిమిసంహారక మందులు సరఫరా అవుతాయని...ఇందుకోసం 25 వాహనాలను అద్దెకు తీసుకున్నట్లు... ప్రతి సెక్టార్‌లో ఒక వాహనం ఉంటుందని వెల్లడించారు. ఈ వాహనంలో ఇద్దరు కార్మికులు, ఒక సూపర్‌వైజర్ ఉంటారని... ఈ బృందం మేళా ప్రాంతంలోని పార్కింగ్ స్థలాల్లో కూడా మందులు చల్లుతుందన్నారు. ప్రభుత్వం ఈసారి పార్కింగ్ స్థలాల్లో కూడా మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించిందని... అందువల్ల ఈ ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులు చల్లడం చాలా ముఖ్యమన్నారు.

అత్యవసర పరిస్థితులకు 45 మంది కార్మికులు

వెక్టర్ కంట్రోల్ అసిస్టెంట్ నోడల్, డిఎమ్ఓ డాక్టర్ ఆనంద్ కుమార్ సింగ్ మాట్లాడుతూ... మేళా ప్రత్యేక అధికారిణి ఆకాంక్ష రానా ఆదేశాల మేరకు అత్యవసర ప్రణాళికను రూపొందించామని చెప్పారు. 45 మంది కార్మికుల బృందాన్ని ఏర్పాటు చేశామని... 15 మంది చొప్పున మూడు షిఫ్టుల్లో పనిచేస్తారన్నారు. వీరు అత్యవసరమైతే వెంటనే రంగంలోకి దిగుతారని...ఇందుకోసం ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు.

కుంభమేళా చుట్టూ ఒక కిలోమీటరు పరిధిలో 150 మంది కార్మికులు పనిచేస్తారు... ఈ ప్రాంతంలోని జనావాస ప్రాంతాల్లో కూడా మందులు చల్లుతారని తెలిపారు.  నవంబర్ 15 నుండి మందులు చల్లడం ప్రారంభించారని వెల్లడించారు.

900 మంది కార్మికులు పనిచేస్తారు

వెక్టర్ కంట్రోల్ జోన్ సెక్టార్ 2లో ఏర్పాటు చేశారు... ఇక్కడ బయట నుండి వచ్చే కార్మికులకు వసతి కల్పిస్తున్నారని వెల్లడించారు. టెంట్లు ఏర్పాటు చేసిన తర్వాత వారిని అక్కడికి తరలిస్తారన్నారు. ప్రస్తుతం 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు... త్వరలోనే ఈ సంఖ్య 150కి చేరుతుంది. జనవరి 1 నుండి 550 మంది, జనవరి 11 నుండి 900 మంది కార్మికులు పనిచేస్తారన్నారు.

వివిధ జిల్లాల నుండి 250 మంది శాశ్వత సిబ్బందిని కోరారు... వీరు కార్మికుల పనితీరును పర్యవేక్షిస్తారన్నారు. 45 మంది మలేరియా ఇన్స్పెక్టర్లు, 28 మంది అసిస్టెంట్ మలేరియా ఇన్స్పెక్టర్లు, 5 మంది డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్లు, 80 మంది సూపర్‌వైజర్లు, 70 మంది శిక్షణ పొందిన కార్మికులను కోరినట్లు డిఎమ్ఓ డాక్టర్ ఆనంద్ కుమార్ సింగ్ తెలిపారు. 

కార్మికులకు వసతి, భోజన సౌకర్యం

 మహా కుంభమేళాలో మందులు చల్లే కార్మికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆనంద్ కుమార్ తెలిపారు. వారికి వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. మహా కుంభనగర్‌లో పనిచేసే ప్రతి కార్మికుడికీ ఈ సౌకర్యం ఉంటుందన్నారు. అవసరం వున్నప్పుడు కార్మికులు అందుబాటులో ఉండేలా చూడటం, ప్రతిరోజూ రాకపోకల ఇబ్బందులను తప్పించడం దీని ఉద్దేశ్యం. మేళాలో వారు ఉండటం భక్తులకు భరోసా కల్పిస్తుందన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios