న్యూఢిల్లీ: రెండు వారాల క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ లో సామూహిక అత్యాచారానికి, చిత్రహింసలకు గురైన మహిళ ఢిల్లీ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం మరణించింది. నలుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి చిత్రహింసలకు గురి చేశారు. 

మహిళ శరీరంపై పలు గాయాలు కావడమే కాకుండా నాలుక కూడా తెగిపోయి స్పృహ తప్పింది. ఈ ఘటన 2012లో జరిగిన నిర్భయ సంఘటనను గుర్తు చేస్తేంది. తొలుత ఆమె ఉత్తరప్రదేశ్ లోని ఆస్పత్రిలో గల ఐసీయూలో చికిత్స పొందుతూ వచ్చింది. ఆ తర్వాత ఆమెను ఢిల్లీ ఆస్పత్రికి తరలించారు. 

ఆమెపై దాడి చేసిన నలుగురు కూడా ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తున్నారు. మహిళ మృతితో వారిపై హత్యానేరం కింద అభియోగాలు మోపనున్నారు. ఆమె మృతితో ఆస్పత్రి ఎదుట ఆందోళనలు చెలరేగాయి. దాంతో గంటల కొద్దీ దారులు మూసుకుపోయాయి. చంద్రశేఖర్ ఆజాద్ రావాన్ భీమ్ ఆర్మీ ఈ ఆందోళనకు దిగింది. 

సోషల్ మీడియాలో విషాదంతో, ఆగ్రహంతో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. మహిళ దళితురాలు కాగా, దాడి చేసిన నలుగురు అగ్రవర్ణాలకు చెందినవారు. ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళల పట్ల దురాచారాలు పెరుగుతూ రావడం ఆందోళన కలిగిస్తోంది. 

వెన్నెముక ఫ్రాక్చర్ కావడంతో ఆమె స్పృహ కోల్పోయింది. దాంతో ఊపిరి తీసుకోవడం కూడా ఆమెకు కష్టంగా మారింది. ఆమె మెడకు దుండగులు ఉరి వేసే సమయంలో నాలుక బయటకు వచ్చి తెగింది. 

దాన్ని విషాదకరమైన సంఘటనగా యుపీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ అన్నారు. తమ ప్రభుత్వం బాధితుల తరఫున నిలబడుతుందని చెప్పారు. వెంటనే నలుగురిని పోలీసులు వెంటనే ఆరెస్టు చేశారని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు 

ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమైన తర్వాత మాత్రమే పోలీసులు స్పందించారని మృతురాలి కుటుంబ సభ్యులు అంటున్నారు. మహిళపై సెప్టెంబర్ 14వ తేదీన దాడి జరిగింది. దుపట్టాను లాగి దాన్ని మెడకు చుట్టి లాక్కునిపోయి దుండగులు అత్యాచారం చేశారు.