లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో కీచక సంఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, దాదడి చేశారు. ప్రస్తుతం ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనలో యుపీలోని హత్రాస్ ప్రాంతంలో జరిగింది. 

యువతిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తులు ఆ దారుణానికి ఒడిగట్టారు. యువతి షెడ్యూల్ కులాలకు చెందింది కాగా, నిందితులు అగ్రవర్ణంగా చెప్పుకునే కులానికి చెందినవారు. మహిళ శరీరమంతా గాయాలైనట్లు వైద్యులు చెప్పారు. నాలుక కూడా కోశారని చెప్పారు. ఆమె పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నట్లు చెప్పారు.

ఆమెను మరిన్ని సౌకర్యాలున్న పెద్ద ఆస్పత్రికి తరలించడం అవసరమని వైద్యులు సూచించారు. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తొలుత తమకు సహకరించలేదని, సంఘటన జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఆ ఆరోపణను ఖండించారు. సంఘటన సెప్టెంబర్ 14వ తేదీన జరిగింది.  

తల్లితో పాటు యువతి పొలంలో పనిచేస్తుండగా దుండగులు వచ్చారు. యువతి దుపట్టాను లాగి, దాన్ని ఆమె మెడ చుట్టూ బిగించి, లాక్కుని వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసి, దాడి చేశారు.