భార్య భర్తల బంధం చాలా గొప్పదని మన పూర్వీకులు చెబుతుంటారు. ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా ఒకరి కోసం మరొకరు కేవలం దంపతులు మాత్రమే బతుకుతారని చాలా గొప్పగా చెబుతుంటారు. అయితే.. అలాంటి బంధాన్ని ఓ మూర్ఖుడు అపహాస్యం చేశాడు. భార్య శీలానికి వెలకట్టి అంగట్లో పెట్టాడు. తాను బైక్ కొనుక్కోవడానికి భార్య పుట్టింటి నుంచి డబ్బులు తేలేదనే అక్కసుతో.. దారుణానికి ఒడి గట్టాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ లోని మెహ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుథియా గ్రామానికి చెందిన పునీత్ అనే వ్యక్తి కొత్వాలీ పోలీస్ సర్కిల్ ప్రాంతానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. కొద్దికాలం వీరి కాపురం సవ్యంగానే సాగింది. తర్వాత పునీత్ కి డబ్బు మీద ఆశపుట్టింది. బైక్ కొనుక్కోవాలని కలలు కన్నాడు. ఆ బైక్ కొనేందుకు డబ్బులు భార్యను తీసుకురావాలంటూ వేధించడం మొదలుపెట్టాడు.

భర్త వేధింపులు భరించలేక పునీత్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య అలా తనను వదిలి పుట్టింటి వెళ్లడంతో అతనికి కోపం మరింత ఎక్కువయ్యింది. దీంతో.. భార్య  ఫోటో, ఫోన్ నెంబర్ పోర్న్ సైట్ లో పెట్టాడు. డబ్బులు చెల్లించి.. తనతో మాట్లాడండి అంటూ తన భార్యే ఆ పోస్టు పెట్టినట్లుగా నమ్మించాడు. అయితే.. ఆమె ఫోన్ నెంబర్ కి పదుల సంఖ్యలో అసభ్య పదజాలం వాడుతూ ఫోన్లు రావడంతో.. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ పని చేసింది ఆమె భర్త అనే విషయం గుర్తించారు. అతనిని అరెస్టు చేశారు.