హత్రాస్: సామూహిక అత్యాచారానికి, చిత్రహింసలకు గురై మరణించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ మహిళ అంత్యక్రియలను పోలీసులే స్వయంగా నిర్వహించారు. రెండు వారాల క్రితం సామూహిక అత్యాచారానికి, చిత్రహింసలకు గురైన మహిళ ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. 

మహిళ కుటుంబ సభ్యులను, బంధువులను ఇళ్లలోంచి బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుని ఆమె అంత్యక్రియలు చేశారు. బుధవారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో పని కానిచ్చేశారు.  రాత్రంతా కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తల్లి రోదిస్తూ తన కూతురు మృతదేహాన్ని అప్పగించాలని కోరినా పట్టించుకోలేదు. చివరి చూపు కోసం వారు మృతురాలిని తీసుకుని వెళ్తున్న అంబులెన్స్ ను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు.

Also Read: గ్యాంగ్ రేప్, చిత్రహింసలు: ఢిల్లీ ఆస్పత్రిలో యుపి మహిళ మృతి

చివరి చూపునకు కూడా అనుమంతించకుండా మహిళ మృతదేహాన్ని స్మశాన వాటికకు తీసుకుని వెళ్లారు. రేపిస్టులను ఉరి తీయాలంటూ నిరసనకారులు ఢిల్లీ ఆస్పత్రి వెలుపల నినాదాలు చేశారు. తమకు తెలియకుండా తమ సోదరి మృతదేహాన్ని తీసుకుని వెళ్లారని మృతురాలి సోదరుడు ఫిర్యాదు చేశారు. 

నిరసనకు దిగిన మహిళ తండ్రి, సోదరులను యుపీ పోలీసులు స్కార్పియో వాహనంలో తీసుకుని వెళ్లడం కనిపించింది. మహిళ మృతదేహాన్ని హత్రాస్ లోని ఆమె స్వగ్రామానికి తీసుకుని వెళ్లారు. తమకు మృతదేహాన్ని అప్పగించకుండా పోలీసులు అంత్యక్రియలు నిర్వహిస్తారని అనుమానించి కుటుంబ సభ్యులు, బందువులు అర్థరాత్రి వరకు ఆందోళన సాగించారు. మృతదేహాన్ని తమకు అప్పగించాలని కోరారు. 

గ్రామంలో మహిళా బంధువులు వాహనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు ఓ మహిళ రోడ్డుపై కూలబడి గుండెలపై బాదుకుంటూ ఏడ్వడం కనిపించింది. నిరసనకారులను తొలగించి వాహనాన్ని స్మశాన వాటికకు తీసుకుని వెళ్లడానికి పలుమార్లు ఆపారు. చాలా మంది బంధువులు ఇంట్లో ఉన్న సమయంలో తెల్లవారు జామున 2.30 గంటలకు మహిళ మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. 

పోలీసులు మానవహారంగా ఏర్పడి మీడియా ప్రతినిధులను, కుటుంబ సభ్యులను, గ్రామస్థులను అడ్డుకున్నారు. చివరకు పోలీసులు మాత్రమే మిగిలారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఇళ్లలో బంధించారు.