Asianet News TeluguAsianet News Telugu

UP Election 2022: మా నాన్నను బలవంతంగా ఎత్తుకెళ్లారు.. బీజేపీ ఎమ్మెల్యే కూతురు సంచలన వీడియో..

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. తన తండ్రి కిడ్నాప్ అయ్యారని.. తన అంకుల్ దేవేష్ షాక్యా (Devesh Shakya) బలవంతంగా ఆయనను లక్నోకి తీసుకెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే వినయ్ షాక్యా కూతురు రియా షాక్యా (Riya Shakya) ఓ వీడియో విడుదల చేయడం హాట్ టాపిక్‌గా మారింది. 

up election 2022 Curious case of BJP MLA Vinay Shakya daughter claim her father kidnapping
Author
Lucknow, First Published Jan 12, 2022, 3:05 PM IST

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. యూపీ కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య (Swami Prasad Maurya) బీజేపీని వీడి.. అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు పలువురు బిజెపి ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి అఖిలేష్ యాదవ్ శిబిరానికి చేరుకున్నారు. ఔరయ్యలోని బిదునా స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యే వినయ్ షాక్యా కూడా అఖిలేష్ పార్టీలో చేరతారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ క్రమంలో వినయ్ షాక్యా కూతురు రియా షాక్యా (Riya Shakya) సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి కిడ్నాప్ అయ్యారని.. తన అంకుల్ దేవేష్ షాక్యా (Devesh Shakya) బలవంతంగా ఆయనను లక్నోకి తీసుకెళ్లారని ఓ వీడియో విడుదల చేయడం హాట్ టాపిక్‌గా మారింది. 

‘మా నాన్నకు కొన్నేళ్ల క్రితం పక్షవాతం వచ్చి నడవలేని స్థితిలో ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. దేవేష్ షాక్యా తన వ్యక్తిగత రాజకీయం కోసం మా నాన్నను లక్నోకు తీసుకెళ్లారు. ఎస్పీ చేరాలని ఒత్తిడి తెస్తున్నాడు. ఎస్పీలో చేరడం మా నాన్నకు ఏ మాత్రం ఇష్టం లేదు’ అని రియా వీడియోలో తెలిపారు. అంతేకాకుండా తన తండ్రి ఆచూకీ కనుగొనడంలో ప్రభుత్వం సహకరించాలని అభ్యర్థించారు. తాము బీజేపీ కోసం పనిచేస్తున్నామని.. పార్టీకి ఎల్లప్పుడు అండగా ఉంటామని తెలిపారు. 

ఇది యూపీలో మరింతగా రాజకీయ వేడిని పెంచింది. అయితే తాజాగా తన కూతురు చేసిన ఆరోపణలను వినయ్ షాక్యా తోసిపుచ్చారు. తాను స్వామి ప్రసాద్ మౌర్య వెంట ఉన్నానని.. సమాజ్ వాదీ పార్టీలో చేరతానని స్పష్టం చేశారు.

మరోవైపు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు కూడా రియా చేసిన ఆరోపణలు నిరాధారమైనవని తేల్చి చెప్పారు. ఔరయా ఎస్పీ అభిషేక్ వర్మ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వినయ్ షాక్యాతో తాను వీడియో కాల్‌లో మాట్లాడానని చెప్పారు. ప్రస్తుతం ఆయన Etawah నివాసంలో ఉన్నట్టుగా కనుగొన్నామని తెలిపారు. పోలీసు సిబ్బంది కూడా ఆయన వద్ద ఉన్నారని.. రియా షాక్యా వైరల్ వీడియో చేసిన ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టం చేశారు.

Vinay Shakya బిదునా స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకసారి ఎమ్మెల్సీగా కూడా నామినేట్ అయ్యారు. బీఎస్పీ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేశారు. రెండేళ్ల క్రితం వినయ్ షాక్యాకు పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి ఆయన బెడ్ రెస్ట్‌లో ఉన్నారు. వినయ్ షాక్యా 2012లో ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో తన సోదరుడు దేవేష్ షాక్యాను బిదునా స్థానం నుంచి పోటీకి దింపారు. అయితే దేవేష్ అక్కడ విజయం సాధించలేదు. అయితే తాజా పరిణామాలను గమనిస్తే వినయ్ షాక్యా కుటుంబంలో విభేదాలు ఉన్నాయని.. ఎన్నికల సందర్భంగా అవి బయటకు వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

ఇదిలా ఉంటే మంగళవారం స్వామి ప్రసాద్ మౌర్యను బీజేపీని వీడిన కొద్ది గంటల్లోనే.. ఎమ్మెల్యేల రోషన్‌లాల్‌ వర్మ, బ్రిజేశ్‌ ప్రజాపతి, భగవతి సాగర్‌ కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios