యోగి సర్కార్ ప్రత్యేక పథకం... గిరిజన అభ్యున్నతికి ఏం చేస్తారో తెలుసా?
ఉత్తర్ ప్రదేశ్‌లో గిరిజనుల అభ్యున్నతి కోసం యోగి ప్రభుత్వం 'ధర్తీ ఆబా జనజాతీ గ్రామ ఉత్కర్ష్ అభియాన్'ని ప్రారంభించింది. ఈ అభియాన్ ద్వారా 26 జిల్లాల్లోని 517 గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలు అందించబడతాయి.
లక్నో : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. అందుకే యోగి ప్రభుత్వం గిరిజనులను అభివృద్ధిలోకి తీసుకురావడానికి, వారి సర్వతోముఖాభివృద్ధికి వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. యోగి ప్రభుత్వం వారికి గృహవసతి, ఆరోగ్యం, విద్య, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పించడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. ఈ పథకాల ద్వారా యోగి ప్రభుత్వం గిరిజన జనాభాకు సమాన అవకాశాల కల్పన, సామాజిక-ఆర్థిక స్థాయి అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, ఆరోగ్యం, విద్య, జీవనోపాధి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి (స్వతంత్ర బాధ్యత) అసీమ్ అరుణ్ మాట్లాడుతూ... షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి అమలు చేస్తున్న "ధర్తీ ఆబా జనజాతీ గ్రామ ఉత్కర్ష్ అభియాన్" ద్వారా యోగి ప్రభుత్వం అన్ని గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత ప్రోత్సాహం, స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. 500 లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో కనీసం 50 శాతం షెడ్యూల్డ్ తెగల జనాభా ఉంటే ఈ పథకం ప్రయోజనం పొందవచ్చు. రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లోని 47 బ్లాక్‌లు, 517 గ్రామాలను ఈ అభియాన్ కింద వివిధ పథకాల ప్రయోజనాల కోసం గుర్తించామని ఆయన తెలిపారు. అవి అంబేద్కర్ నగర్, బహ్రాయిచ్, బలియా, బలరాంపూర్, బారాబంకీ, బస్తీ, భదోహి, బిజ్నోర్, చందౌలీ, దేవారియా, గాజీపూర్, గోరఖ్‌పూర్, జౌన్‌పూర్, లఖింపూర్ ఖీరీ, కుషీనగర్, లలిత్‌పూర్, మహారాజ్‌గంజ్, మహోబా, మీర్జాపూర్, పిలిభిత్, ప్రయాగ్‌రాజ్, సంతకబీర్ నగర్, శ్రావస్తి, సిద్ధార్థ నగర్, సీతాపూర్, సోన్‌భద్ర.
అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు
యోగి ప్రభుత్వం గుర్తించిన గ్రామాల్లో రోడ్లు, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను విస్తరిస్తుంది. అన్ని గిరిజన కుటుంబాలకు పక్కా ఇళ్ళు కల్పిస్తుంది. వారి గ్రామాల్లో మొబైల్ మెడికల్ యూనిట్లను (MMU) ఏర్పాటు చేసి, వైద్య సేవలను అందిస్తుంది. గిరిజన ప్రాంతాల్లో గిరిజన బహుళార్థసాధక మార్కెటింగ్ కేంద్రాలను (TMMC) ప్రారంభించి, గిరిజనుల కళలు, సంస్కృతి, చిత్రలేఖనం, అటవీ ఉత్పత్తులు, తేనె, చిరుధాన్యాలు, మహువా ఉత్పత్తులు, మూలికలతో తయారు చేసిన సహజ ఔషధాలను మార్కెటింగ్ చేసేందుకు, గిరిజనుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తుంది. దీనివల్ల గిరిజనులు వలసలు వెళ్ళాల్సిన అవసరం ఉండదు.
ఇంకా మంత్రి మాట్లాడుతూ... "ధర్తీ ఆబా జనజాతీ గ్రామ ఉత్కర్ష్ అభియాన్" అమలు కోసం గిరిజన సంక్షేమ శాఖతో పాటు గ్రామీణాభివృద్ధి, జలవనరులు, విద్యుత్, ఇంధన, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పెట్రోలియం, సహజ వాయువు, మహిళా, శిశు సంక్షేమం, విద్య, ఆయుష్, టెలికమ్యూనికేషన్స్, వృత్తి, నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత, వ్యవసాయం, రైతు సంక్షేమం, మత్స్య, పశుసంవర్ధక, పాడి, పంచాయతీ రాజ్, పర్యాటక శాఖలు కలిసి పనిచేస్తాయని తెలిపారు.
ఈ పథకం కింద గిరిజన సంక్షేమ శాఖ బహుళార్థసాధక మార్కెటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఈ కేంద్రాల్లో గిరిజన ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తారు. షెడ్యూల్డ్ తెగల కోసం నడుపుతున్న ఆశ్రమ పాఠశాలలు/హాస్టళ్ళు, ఇతర ప్రభుత్వ గురుకులాలు మెరుగుపరచడానికి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సహాయం అందిస్తారు.
'ధర్తీ ఆబా జనజాతీ గ్రామ ఉత్కర్ష్ అభియాన్' కేంద్ర ప్రభుత్వ సమగ్ర అభివృద్ధి ప్రయత్నాలలో భాగం. దీని ద్వారా గిరిజన సమాజాలను సామాజిక, ఆర్థికంగా ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో గిరిజన జనాభా సమగ్ర అభివృద్ధికి ఈ అభియాన్ ద్వారా ప్రణాళికలు రూపొందించారు. ఈ అభియాన్ విజయవంతంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రంలోని గిరిజన జనాభాకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల ఈ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, ఉపాధి, మౌలిక సదుపాయాలు మెరుగుపడి, సమగ్ర జాతీయ అభివృద్ధికి దోహదపడుతుంది.