తల్లి దండ్రులు తీసుకున్న అప్పు ఓ చిన్నారి పట్ల శాపంగా మారింది. తీసుకున్న అప్పు చెల్లించలేదని... ఓ వడ్డీ వ్యాపారి  చిన్నారి గుడ్లు పీకేసి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీఘర్ ప్రాంతానికి చెందిన దంపతులు ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ.10వేలు అప్పుగా తీసుకున్నారు. అప్పు తీసుకొని రోజులు గడుస్తున్నా వారు తిరిగి ఇవ్వలేదు. దీంతో.. ఆగ్రహించిన వడ్డీ వ్యాపారి డబ్బు ఇవ్వాల్సిందిగా ఆ దంపతులను కోరాడు. వాళ్లు మరికొద్ది రోజులు ఆగాల్సిందిగా బ్రతిమిలాడారు. అయితే... అందుకు అంగీకరించని వ్యాపారి.. ఆ దంపతులకు రెండున్నరేళ్ల కుమార్తెను కిడ్నాప్ చేశాడు.

అనంతరం ఆ చిన్నారిని అతి పాశవికంగా గొంతునులిమి చంపేశాడు. అంతటితో ఆగకుండా చిన్నారి కను గుడ్లను బయటకు పీకేశాడు.రోజులు గడుస్తున్నా కూతురు కనిపించకపోవటంతో ఆ దంపతులు గత నెల 31వ తేదీన పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు వడ్డీ వ్యాపారి మీద అనుమానం వచ్చింది.

దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించగా.. చేసిన నేరం ఒప్పుకున్నాడు. వడ్డీ వ్యాపారితో పాటు అతడికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.