దేశరాజధానిలో మహిళలు, చిన్నారులు కామాంధుల కామానికి బలైపోతున్నారు. ఈ క్రమంలో చివరికి ట్రాన్స్‌జెండర్లను కూడా మృగాళ్లు వదిలిపెట్టడం లేదు. సెక్స్‌కు ఒప్పుకోలేదని ఓ ట్రాన్స్‌జెండర్‌ను దుండగులు తుపాకీతో కాల్చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం తెల్లవారుజామున నగరంలోని త్రిలోక్‌పురి-బారాపుల్లా రహదారిపై ఓ ట్రాన్స్‌జెండర్‌ లిఫ్ట్ అడిగింది.

ఆమెను అమ్మాయిగా పొరబడిన దుండగులు బలవంతంగా కారెక్కించుకుని అనంతరం లైంగికదాడికి పాల్పడ్డారు. ఆమె ట్రాన్స్‌జెండర్ అని తెలిసినప్పటికి బలవంతం చేయడంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది.

దీంతో ఆగ్రహానికి గురైన కామాంధులు ఆమెను తుపాకీతో కాల్చేసి, అనంతరం కదులుతున్న కారులోంచి నెట్టేశారు.  గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు.

అనంతరం సదరు ట్రాన్స్‌జెండర్‌ను ఎయిమ్స్‌కు తరలించారు. కోలుకున్న అనంతరం ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ రోజు సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించి కారు నెంబర్ ఆధారంగా ఓ నిందితుడని పట్టుకున్నారు.  అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.