09:26 PM (IST) Aug 04

సుప్రీంకోర్టులో 71 వేల పెండింగ్ కేసులు

సుప్రీంకోర్టులో 71 వేలకు పైగా కేసులు పెండింగ్‌లో వున్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్‌కు తెలియజేశారు. వీటిలో 56,000 సివిల్ కేసులు కాగా.. 15,000 క్రిమినల్ కేసులు వున్నాయి. వీటిలో మెజారిటీ కేసులు దాదాపు పదేళ్లకు పైగా పెండింగ్‌లో వున్నాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. 

08:39 PM (IST) Aug 04

తెలంగాణలో 24 గంటల్లో 1,061 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటలలో 1,061 కేసులు నమోదయ్యాయి. 836 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 6,357 మంది వైరస్‌ కారణంగా ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 401 కేసులు నమోదయ్యాయి. 

07:45 PM (IST) Aug 04

వాహనదారులపై చేయి చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోతున్నారు. వాహనదారులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా చేయి చేసుకుంటున్నారు. వరుస సంఘటన నేపథ్యంలో ట్రాఫిక్ సిబ్బంది తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్.. ఎమర్జెన్సీ పని మీద వెళ్తున్నానని వాహనదారులు చెబుతున్నా వినిపించుకోలేదు కూకట్‌పల్లి ఇన్స్‌పెక్టర్. చలానా కట్టి ఇక్కడి నుంచి కదలాలని రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

07:13 PM (IST) Aug 04

కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్‌లో ప్రీ క్వార్టర్స్‌కు చేరిన సింధు

కామన్‌వెల్త్ క్రీడల్లో భాగంగా భారత షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు ప్రీ క్వార్టర్స్‌కు చేరారు. 32వ రౌండ్‌లో మాల్దీవ్స్‌కి చెందిన ఫాతిమా నబా అబ్దుల్ రజాక్‌ను 21-4, 21-11 తేడాతో సింధు ఓడించారు. ఇక పురుషుల సింగిల్స్ విషయానికి వస్తే.. ఉగాండాకు చెందిన డేనియల్ వానాగలియాను కిదాంబి శ్రీకాంత్ 21-9, 21-9 తేడాతో ఓడించాడు. 

06:07 PM (IST) Aug 04

ఐదేళ్లలో నోటా బటన్ నొక్కిన 1.29 కోట్లమంది

ఎన్నికల సమయంలో అభ్యర్ధులెవ్వరూ నచ్చనిపక్షంలో నోటాను ఎంచుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే గడిచిన ఐదేళ్ల కాలంలో జరిగిన సార్వత్రిక, ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 1.29 కోట్ల మంది ఓటర్లు నోటాకు ఓటు వేసినట్లు అసోసియేట్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది.

05:09 PM (IST) Aug 04

సంజయ్ రౌత్ భార్యకూ ఈడీ నోటీసులు

పత్రా చాల్‌ భూ కుంభకోణం మనీలాండరింగ్ ఆరోపణలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఆయనకు విధించిన కస్టడీ నేటితో ముగియడంతో.. ఈడీ ఆయనను పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. దీంతో ప్రత్యేక కోర్టు అతడి కస్టడీని ఈ నెల 8 వరకు పొడిగించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సంజయ్ రౌత్ సతీమణి వర్షా రౌత్‌ను తాజాగా ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో వర్షా రౌత్‌కు సంబంధించిన కొన్ని ఆస్తులను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే.

04:19 PM (IST) Aug 04

సోనియాకు రాజగోపాల్ రెడ్డి లేఖ

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం లేఖ రాశారు. కాంగ్రెస్ ద్వారా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మరో రాజకీయ పోరాటం చేయాలని లేఖలో కోమటిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని కొందరు నిర్వీర్యం చేశారని.. ఎమ్మెల్యేలను గెలిపించలేని వ్యక్తులు, గెలిచిన ఎమ్మెల్యేల్లో మనోధైర్యం నింపలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. జైలుపాలైన వ్యక్తి ఆధ్వర్యంలో తాను కలిసి పనిచేయలేనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అనేక పార్టీలు మారి స్వలాభం కోసం ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేశారని ఆయన ఆరోపించారు.


03:32 PM (IST) Aug 04

నల్గొండ జిల్లాలో కోవిడ్ కలకలం

నల్గొండ జిల్లాలో కరోనా కలకలం రేపింది. దేవరకొండ నియోజకవర్గంలోని నేరేడుగొమ్ము కస్తూర్బా గాంధీ పాఠశాలలో 16 మంది విద్యార్ధినులకు, ఒక ఉపాధ్యాయురాలికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు భారీగా పాఠశాలకు చేరుకుంటున్నారు.

02:54 PM (IST) Aug 04

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. ఐబీ హెచ్చరికలు

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ.. ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించే అవకాశం వుందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దేశ రాజధానితో ఢిల్లీతో పాటు కీలక నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఐబీ హెచ్చరించింది. 

01:49 PM (IST) Aug 04

ముగిసిన ఈడీ కస్టడి... ప్రత్యేక కోర్టుకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్

మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ను ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) కోర్టులో హాజరుపర్చింది. ఈడీ కస్టడి గడువు ముగియడంతో ఎంపీని తిరిగి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చింది ఈడీ. ఈ సందర్భంగా తన అనుచరులు, శివసేన నాయకులు, కార్యకర్తలకు కోర్టు వద్ద అభివాదం చేసారు సంజయ్ రౌత్. 

01:12 PM (IST) Aug 04

కాంగ్రెస్ కు బిగ్ షాక్... బిజెపిలోకి మాజీ సీఎం తనయుడు

హర్యానా కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ తనయుడు, ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ బిజెపిలో చేరాడు. మాజీ ఎమ్మెల్యే అయిన తన భార్యతో పాటు మరికొందరు కాంగ్రెస్ నాయకులు, అనుచరులతో కలిసి ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమక్షంలో కుల్దీప్ బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా గెలిచిన కుల్దీప్ పార్టీని వీడటం హర్యానా కాంగ్రెస్ పెద్ద ఎదురుదెబ్బే. 

12:50 PM (IST) Aug 04

ముంబైలో భారీ డ్రగ్స్ ముఠా అరెస్ట్... రూ.1400కోట్ల డ్రగ్స్ స్వాధీనం

దేశ ఆర్థిక రాజధాని ముంబై లో భారీ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయ్యింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నాలాసొపారా ప్రాతంలో డ్రగ్స్ తయారీ యూనిట్ పై పోలీసులు దాడులు నిర్వహించి 700కిలోల మెఫిడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1400 కోట్ల వరకు వుంటుందని ముంబై క్రైమ్ బ్రాంచ్ యాంటి నార్కోటిక్ విభాగం వెల్లడించింది. డ్రగ్స్ ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

11:51 AM (IST) Aug 04

సుప్రీం చీఫ్ జస్టిస్ గా యుయు లలిత్... కేంద్రానికి జస్టిస్ ఎన్వీ రమణ సిపార్సు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నూతన చీఫ్ జస్టిస్ ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో తదుపరి చీఫ్ జస్టిస్ గా జస్టిస్ గా ఉదయ్ ఉమేష్ లలిత్ ను నియమించాలని ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కేంద్రానికి సిపార్సు చేసారు.

10:24 AM (IST) Aug 04

భారత్ లో 20వేలకు చేరువలో కరోనా కేసులు...

భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్టుల్లో 19,893 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. అలాగే కరోనా బాధపడుతున్నవారిలో తాజాగా 53 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటిదవరకు దేశంలో నమోదయిన మొత్తం కేసులు 4,40,87.037 కు చేరగా మరణాల సంఖ్య 5,26,530 కు చేరాయి. 

09:41 AM (IST) Aug 04

కరీంనగర్ లో ఘోర రోడ్డుప్రమాదం... ఇద్దరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

జగిత్యాల-కరీంనగర్ హైవేపై ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసి బస్సు, లారీ ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఇద్దరు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. బస్సులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. 

09:37 AM (IST) Aug 04

నిర్మల్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు విషజ్వరాలు

నిర్మల్ జిల్లాలో సీజనల్ వ్యాధులు కలకలం రేపుతున్నాయి. నిర్మల్ పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్ధులు విషజ్వరంతో బాధపడుతున్నారు. దీంతో అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు దాదాపు 60 మంది విద్యార్థులకు ఇళ్లకు పంపించారు. 

09:27 AM (IST) Aug 04

హరిద్వార్ జైల్లో కరోనా కలకలం... ఖైదీలకు పాజిటివ్

భారతదేశంలో కరోనా మహమ్మారి ఆందోళన మళ్లీ పెరుగుతోంది. ఇటీవల తెలంగాణలో పలు స్కూళ్లలో కరోనా కేసులు వెలుగుచూడగా తాజాగా ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ జైల్లో ఖైదీలు కరోనా బారిన పడ్డారు. జైల్లోని 425 మంది ఖైదీలకు టెస్టులు చేయగా 43 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు జిల్లా వైద్యాదికారి ఖగేంద్ర సింగ్ వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన జైలు అధికారులు కరోనా సోకిన ఖైదీలను ప్రత్యేక బ్యారక్ లో ఐసోలేషన్ లో వుంచారు.