తెలంగాణలో కొత్తగా 376 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇందులో ఒక్క హైదరాబాద్‌లో అత్యధికంగా 164 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 406 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 2,722 మంది చికిత్స పొందుతున్నారు.
నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...
తెలంగాణలో కొత్తగా 376 కరోనా కేసులు
తమిళిసైని కలిసిన బీజేపీ నేతలు
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతించేలా చూడాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు వినతిపత్రం అందజేశారు రాష్ట్ర బీజేపీ నాయకులు. అలాగే బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన పోలీసులు, టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి విచారణ జరిపించాలని వారు గవర్నర్‌ను కోరారు.
మనీష్ సిసోడియాపై ఈడీ కేసు
ఢిల్లీ ఎక్సైజ్ స్కాంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఈడీ కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసింది. మరోవైపు ఢిల్లీ ఎక్సైజ్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫినిక్స్ గ్రూప్ కంపెనీ కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో 25 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహించింది.
రాజాసింగ్‌కు బెయిల్
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. 41 పీఆర్సీ కింద ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారని.. ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్స్ పున: ప్రారంభం
సినిమా షూటింగ్స్ పున: ప్రారంభంపై టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 25 నుంచి విదేశాల్లో సినిమా షూటింగ్‌లను ప్రారంభిస్తున్నట్లు నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో సినిమా షూటింగ్స్ తిరిగి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో చంచల్‌గూడ జైలు వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
నాంపల్లి కోర్ట్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్ట్ బయట ఎంఐఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పోలీసులు ఆయనను నాంపల్లి కోర్ట్‌లో హాజరు పరిచారు. విషయం తెలుసుకున్న ఓ వర్గం యువకులు పెద్ద సంఖ్యలో కోర్ట్ వద్దకు చేరుకుని రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బిహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామా
రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామా చేయాల్సి వచ్చింది. తన ఆత్మగౌరవాన్ని అవిశ్వాస తీర్మానం దెబ్బతీస్తుందనే స్పీకర్ పదవికి రాజీనామా చేసినట్లు విజయ్ కుమార్ తెలిపారు.
బండి సంజయ్ పాదయాత్రను నిలిపివేయండి: జనగామ పోలీసుల నోటీసులు
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రను నిలిపివేయాలంటూ జనగామ జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేసారు. ఈ మేరకు వర్దన్నపేట ఏసిపి పేరిట పాదయాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ లకు నోటీసులు జారీ చేసారు. జనగామ జిల్లాలో ఈ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని నోటీసులో పేర్కొన్నారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ వేటు... బిజెపి అదిష్టానం సంచలనం
మహ్మద్ ప్రవక్తపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండటంతో బిజెపి హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. బిజెపి నుండి రాజాసింగ్ ను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ నుండి ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వాలని... సెప్టెంబర్ 2వ తేదీ లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. శాసనసభాపక్ష నేత పదవినుండి రాజాసింగ్ ను బిజెపి అదిష్టానం తొలగించింది.
రాష్ట్రపతి ముర్మును కలిసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా
ఇటీవలే విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ విజయంతో దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిని దక్కించుకున్న ద్రౌపది ముర్మును కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కలిసారు. రాష్ట్రపతి ముర్ముకు పుష్ఫగుచ్చం ఇచ్చిన సోనియా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ముస్లీంలే కాదు వారి దైవం మహ్మద్ ప్రవక్త అన్నా బిజెపికి ద్వేషమే : అసదుద్దీన్ ఓవైసి
మహ్మద్ ప్రవక్తపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు హైదరాబాద్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా రాజాసింగ్ వ్యాఖ్యలపై ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీస్ ఓవైసి సీరియస్ అయ్యారు. ముస్లీంలనే కాదు వారి దైవం మహ్మద్ ప్రవక్తను బిజెపి ద్వేషిస్తోందన్నారు. హైదరాబాద్ శాంతిభద్రతలు అదుపులో లేకుండా చేయాలని బిజెపి ప్రయత్నిస్తోందని... అందులో భాగంగానే అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఓవైసి పేర్కొన్నారు.
టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్ కు కరోనా పాజిటివ్
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా బారినపడ్డారు. దీంతో ఆగస్ట్ 27నుండి జరగనున్న ఆసియా కప్ కోసం రోహిత్ శర్మ సారథ్యంలో భారత ఆటగాళ్ళు దుబాయ్ కి వెళ్లగా ద్రవిడ్ మాత్రం దూరమయ్యారు. అయితే కరోనా నుండి కోలుకున్న తర్వాత ద్రవిడ్ దుబాయ్ కి పయనమవుతాడని బిసిసిఐ తెలిపింది.
కల్వకుంట్ల కవిత ఇంటి ముట్టడి... బిజెపి నాయకులపై సీరియస్ కేసులు
తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు డిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధాలున్నట్లు బిజెపి ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలో కవితపై చర్యలకు డిమాండ్ చేస్తూ సోమవారం సాయంత్రం బిజెవైఎం నాయకులు ఆమె ఇంటిని ముట్టడించారు. ఇలా కవిత ఇంటిముట్టడికి యత్నించిన 26మంది బీజేపీ నాయకులు, కార్యకర్తల మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 341,147,148, 353, 332, 509 red with 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ని జనగామలో పోలీసులు అరెస్ట్ చేసారు. డిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడికి యత్నించిన బిజెపి కార్యకర్తలపై పెట్టిన హత్యాయత్నం కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జనగామలో ప్రజాసంగ్రామ యాత్రాస్థలంలోనే ధర్మ దీక్షకు దిగారు సంజయ్. ఈ దీక్షను భగ్నం చేసిన పోలీసులు సంజయ్ ని అరెస్ట్ చేసారు. అయితే బండి సంజయ్ ని తరలిస్తున్న పోలీస్ వాహనాన్ని బిజెపి శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది. పోలీసులు, బిజెపి శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి హైదరాబాద్ పాతబస్తీలో అలజడికి కారణమైన బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. రాజాసింగ్ ఇంటివద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా బందోబస్తు ఏర్పాటుచేసి ఆయనను అరెస్ట్ చేసారు.

రాజాసింగ్ వ్యాఖ్యలపై దుమారం... వీడియో తొలగించిన యూట్యూబ్
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తను అవమానించే వ్యాఖ్యలు చేసి తమ మనోభావాలు దెబ్బతీసాడంటూ హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో మజ్లిస్ నాయకులు, ముస్లీం సంఘాలు ఆందోళన చేపట్టాయి. వెంటనే రాజాసింగ్ ను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేసారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు రాజాసింగ్ ఇంటివద్ద బందోబస్తు ఏర్పాటుచేసారు. మరోవైపు బిజెపి ఎమ్మెల్యే వీడియోపై వివాదం రేగుతుండటంతో యూట్యూబ్ ఆ వీడియోను తొలగించింది.
డిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు... తెలంగాణలో బిజెపి ఆందోళనలు
డిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హస్తముందన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ (మంగళవారం) ఆందోళనలకు బిజెపి పిలుపునిచ్చింది. కవిత ఇంటివద్ద ఆందోళనకు దిగిన బిజెపి శ్రేణులపై పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టడాన్ని బిజెపి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నేడు నిరసనలకు పిలుపునిచ్చాడు.