ఓ వ్యక్తి ఏకాలంలో ఇద్దరితో ప్రేమాయణం నడిపాడు. కొద్ది రోజులు ఇద్దరినీ బాగానే మేనేజ్ చేశాడు. తర్వాత ఈ విషయం ఆ ఇద్దరు అమ్మాయిలకు తెలిసిపోయింది. ఇంకేముంది అడ్డంగా బుక్కయ్యాడు. ఇద్దరూ కలిసి తనను చావబాదుతారేమో అనే భయంతో అక్కడి నుంచి పరారవ్వాలని ప్రయత్నించాడు. కానీ... ఆ ఇద్దరూ కలిసి అతనికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇద్దరినీ పెళ్లి చేసుకోమని... ముగ్గురం కలిసే బతుకుదామని చెప్పారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తిరువూరు జిల్లా ధర్మాపురానికి చెందిన ఓ యువతికి పెళ్లై... భర్తతో విడాకులు తీసుకుంది. ఆమెకు కొంతకాలం క్రితం ఓ ఆటో డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. అయితే... ఆ   ఆటో డ్రైవర్ కి ఇది వరకే మరో యువతితో ప్రేమాయణం నడుపుతున్నాడు. కొద్దిరోజుల్లో ఆటోడ్రైవర్‌ బండారం ఇద్దరు యువతులకు తెలిసిపోవడంతో అతన్ని నిలదీశారు. దీంతో ఆటోడ్రైవర్‌ ఇద్దరినీ వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

 ఆటోడ్రైవర్‌ పన్నాగాన్ని పసిగట్టిన ఇద్దరు యువతులు కూడబలుక్కున్నారు. ఇద్దరూ ఏకకాలంలో అతడిని వివాహమాడాలని, కలిసి కాపురం చేయాలని నిర్ణయించుకుని ఆ విషయాన్ని అతడికి చెప్పడంతో ఆటోడ్రైవర్‌ సంతోషంతో ఎగిరి గంతేశాడు. ముగ్గురూ కలుసుకుని పెద్దలతో చెప్పకుండా ఇళ్లు వదిలి పళనికి పారిపోయారు. 

అక్కడి ఒక ఆలయంలో ఇద్దరు యువతుల మెడలో అతడు తాళి కట్టి పెళ్లాడాడు. పెళ్లి చేసుకొని పళని నుంచి కోయంబత్తూరు వెళ్లేందుకు బస్‌స్టేషన్‌లో నిల్చుని ఉండగా పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న యువతుల కుటుంబీకులు లబోదిబోమంటూ ఆ పెళ్లికి నిరాకరించారు. యువతులకు ఎంతగా నచ్చజెప్పినా ఆటోడ్రైవర్‌తోనే కలిసి ఉంటామని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో చేసేదిలేక... పోలీసులకు కూడా ఆటో డ్రైవర్ ని అతని ఇద్దరు భార్యలను సంతోషంగా అక్కడి నుంచి సాగనంపారు.