హర్యానా-పంజాబ్ సరిహద్దులో ఉద్రిక్తత.. రైతులపై బాష్పవాయువు ప్రయోగం.. ఎందుకంటే ?
దేశ రాజధానిని (Delhi) కలిపే రహదారులన్నీ ఢిల్లీలో పోలీసులు మూసివేశారు. ‘ఢిల్లీ ఛలో’ (delhi chalo) కోసం రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. దేశ రాజధానిలో ప్రవేశించాలని భావించిన రైతులపై హర్యానా-పంజాబ్ సరిహద్దుల్లో (Haryana-Punjab border) పోలీసులు బాష్ప వాయువు (tear gas) ప్రయోగించారు (The police fired tear gas at the farmers.)
పంజాబ్-హర్యానా సరిహద్దులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఢిల్లీలో నిరసన తెలియజేసేందుకు వస్తూ శంభు వద్దకు చేరుకున్న రైతులను పోలీసులు నిలువరించారు. వారిపై బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రైతు సంఘాల నాయకులు, కేంద్ర మంత్రులతో సోమవారం సమావేశం నిర్వహించారు. అయితే అది అసంపూర్తిగానే, తీర్మానం లేకుండానే ముగియడంతో 200కు పైగా రైతు సంఘాలు ఢిల్లీలో మార్చ్ ను కొనసాగించాలని నిర్ణయించాయి.
ఈ ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం కోసం వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు దేశ రాజధానికి చేరుకుంటున్నారు. అయితే వీరిని ఢిల్లీకి రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతా చర్యలను పెంచడంతో పాటు సమావేశాలపై ఆంక్షలు విధించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు సరిహద్దులను పటిష్టం చేశారు.ఢిల్లీకి చేరుకునే సరిహద్దులను పోలీసులు మూసివేశారు. ఢిల్లీని ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్, నోయిడాలతో కలిపే ఘాజీపూర్, చిల్లా సరిహద్దుల్లో వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు.
కాగా.. తమ డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ వెళ్లే మార్గంలో హర్యానాలోని అంబాలా వైపు వెళ్తున్న రైతులను రాజ్ పురా బైపాస్ దాటేందుకు పంజాబ్ పోలీసులు అనుమతించారు. అయితే ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో పంజాబ్-హర్యానా శంభు సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగాయి.
ఢిల్లీ అంతటా భద్రతా చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు. మార్చి 12 వరకు భారీ సమావేశాలను నిషేధిస్తూ ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు, ర్యాలీలు, ట్రాక్టర్లు, ఆయుధాలు, మండే వస్తువులు తీసుకెళ్లడంపై నిషేధం విధించారు. సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రహదారులను కాంక్రీట్ బ్లాకులతో అడ్డం పెట్టారు. ముళ్లకంచెలతో పటిష్టం చేశారు.
ఢిల్లీ సరిహద్దుల్లో చర్యలతో పాటు, పంజాబ్ తో ఉన్న సరిహద్దుల వెంబడి భద్రతను హర్యానా అధికారులు కట్టుదిట్టం చేశారు. అంబాలా, జింద్, ఫతేహాబాద్, కురుక్షేత్ర, సిర్సా వంటి ప్రాంతాల్లో కాంక్రీట్ బ్లాక్ లు, ఇనుప గోళ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేసి రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఆందోళనకారులను అడ్డుకున్నారు. హర్యానాలో 64 కంపెనీల పారామిలటరీ సిబ్బందిని, 50 కంపెనీల హర్యానా పోలీసులను వివిధ జిల్లాల్లో మోహరించారు.
కాగా.. పంటలకు ఎంఎస్పీ హామీ ఇచ్చే చట్టాన్ని తీసుకురావడం సహా వివిధ డిమాండ్లను పరిష్కరించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ఉద్దేశించిన 'ఢిల్లీ చలో' మార్చ్ కు దేశవ్యాప్తంగా 200కు పైగా రైతు సంఘాలు మద్దతు పలికాయి.