Swachh Survekshan report : ఇండియాస్ క్లీనెస్ట్ సిటీగా ఇండోర్ .. వరుసగా 7వ సారి అగ్రస్థానం
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు. దీనిలో భాగంగా 2016లో పరిశుభ్రతలో మంచి పనితీరు కనబరిచే నగరాలను గుర్తించడం, గౌరవించడం , ప్రోత్సహించడం కోసం స్వచ్ఛ సర్వేక్షణ్ అనే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారు
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు. దీనిలో భాగంగా 2016లో పరిశుభ్రతలో మంచి పనితీరు కనబరిచే నగరాలను గుర్తించడం, గౌరవించడం , ప్రోత్సహించడం కోసం స్వచ్ఛ సర్వేక్షణ్ అనే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారు. దీని కింద స్వచ్ఛ నగరాలకు అవార్డును అందజేస్తారు.
స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా ప్రారంభించబడిన ఈ పథకం కింద, ప్రతి సంవత్సరం కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివిధ కేటగిరీల కింద దేశంలోని పరిశుభ్రమైన నగరాల ర్యాంకింగ్ జాబితాను విడుదల చేస్తుంది. దీని ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023 సంవత్సరానికి గాను స్వచ్ఛ్ సర్వేక్షణ్ ఫలితాలను ప్రకటించారు. ఇందులో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ భారతదేశంలోని పరిశుభ్రమైన నగరాల జాబితాలో వరుసగా 7వ సారి అగ్రస్థానంలో నిలిచింది.
అలాగే, తొలిసారిగా గుజరాత్‌లోని సూరత్ భారతదేశపు అత్యంత పరిశుభ్రమైన నగరంగా టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇండోర్ , సూరత్‌లు పరిశుభ్రమైన నగరాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి. 2021 , 2022లలో రెండవ స్థానంలో ఉన్న సూరత్ 2023లో ఇండోర్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానాన్ని పంచుకుంది. లక్షకు పైగా జనాభా ఉన్న దేశంలోని ఈ పరిశుభ్రమైన నగరాల జాబితాలో మహారాష్ట్రలోని నవీ ముంబై మూడో స్థానంలో నిలిచింది.
అదేవిధంగా లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల్లో మహారాష్ట్రకు చెందిన సాస్వత్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విభాగంలో ఛత్తీస్‌గఢ్‌లోని పటాన్, మహారాష్ట్రలోని లోనావాలా వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. కంటోన్మెంట్ బోర్డుల విభాగంలో మౌ కంటోన్మెంట్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, గంగా నగరాల్లో వారణాసి అత్యుత్తమ నగరాల్లో నిలిచింది. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్ క్లీన్ స్టేట్‌లుగా నిలిచాయి.
పట్టణ పరిశుభ్రత సర్వే 8వ ఎడిషన్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ పరిశుభ్రత సర్వే అని ప్రభుత్వం పేర్కొంది. 2016లో ప్రారంభమైన ఈ సర్వే తొలుత 73 ప్రధాన నగరాలను మాత్రమే కవర్ చేసింది. 2023 నాటికి ఈ సంఖ్య 4,477కి పెరిగింది. వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, తగ్గింపు, పునర్వినియోగం, రీసైక్లింగ్ , పారిశుధ్య కార్మికుల భద్రతకు భరోసా వంటి విధానాలకు ప్రాధాన్యతనిస్తూ పై ర్యాంకింగ్ జాబితా తయారు చేయబడింది.
మొత్తంగా, సర్వే సుమారు 409 మిలియన్ల మందిని కవర్ చేయగా.. 12 కోట్ల మంది నుండి స్పందనలు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సర్వేను వివిధ పద్ధతులు, మార్గాల ద్వారా నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.