Asianet News TeluguAsianet News Telugu

Supreme Court: "ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే.. ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు"

Supreme Court: సుప్రీం కోర్టు కీలక తీర్పు నిచ్చింది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులని రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనను సుప్రీం కోర్టు సమర్థించింది. ఇది వివక్షత కాదని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. 

Supreme Court upholds Rajasthan 2-child norm for govt jobs krj
Author
First Published Mar 1, 2024, 6:48 AM IST

Supreme Court: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆప్లై చేసుకోవాలంటే .. సదరు అభ్యర్థికి ఎన్నో అర్హతలు ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి విద్యార్హతలు, మార్కుల శాతం, నిర్ణీత వయసు, ఇక డిపార్ట్ మెంట్ ఉద్యోగాల విషయానికి వస్తే.. కొలువు తగినట్టు శారీక దారుఢ్యం, ఎత్తు వంటి పలు నిబంధనలు ఉంటాయి. అయితే.. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మరో అదనపు నిబంధనను విధించింది. ఎన్ని యేండ్లుగా ఆ నిబంధనను అమలు చేస్తోంది కూడా. ఆ నిబంధననే ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉంటే.. సదరు వ్యక్తి  ప్రభుత్వం ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అనర్హుడు.

ఈ నిబంధన కారణంగా ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోయాడు. దీంతో ఆ నిబంధనను సవాల్ చేస్తూ.. మొదట హైకోర్టును ఆశ్రయించగా..ఎదురుదెబ్బ తగిలింది. అయితే.. తగ్గేదేలే అన్నట్టు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా అదే రకమైన తీర్పును ఇవ్వడంతో మరో సారి షాక్ తిన్నాడు. 

అసలేం జరిగిందంటే.

ప్రభుత్వ నియామకాల్లో రాజస్థాన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇద్దరు పిల్లల నిబంధనను తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు అని రాజస్థాన్‌ సర్కార్ విధించింది.  గత కొంత కాలంగా అమలులో ఉన్న ఈ  నిబంధనలో ఎలాంటి వివక్ష లేదని, అందులో ఎలాంటి రాజ్యాంగ ఉల్లంఘన లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. న్యాయమూర్తులు సూర్యకాంత్, దీపాంకర్ దత్తా , కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం.. ఈ సందర్భంగా 2003 నాటి ఒక కేసులో ఇదే విధమైన నిబంధనను (పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత షరతుగా ప్రవేశపెట్టబడింది) సుప్రీం కోర్టు సమర్థించిందని పేర్కొంది.

కేసు వివరాల్లోకెళ్తే..  రాజస్థాన్‌కు చెందిన రామ్‌జీ లాల్‌ జాట్‌ అనే వ్యక్తి భారత సైన్యంలో పనిచేసి 2017 లో పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత 2018లో రాజస్థాన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగం  కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, రామ్‌జీకి ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనే కారణంతో ఆయన దరఖాస్తును రిక్రూట్‌మెంట్ బోర్డ్ తిరస్కరించింది.రాజస్థాన్ పోలీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1989  రూల్ 24(4) ప్రకారం అతని అభ్యర్థిత్వం తిరస్కరించబడింది.

ఈ నిబంధనను సవాల్ చేస్తూ.. రామ్‌జీ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే రామ్‌జీ పిటిషన్‌ను రాజస్థాన్‌ హైకోర్టు 2022లో కొట్టివేసింది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం, 1 జూన్ 2002న లేదా ఆ తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న ఏ వ్యక్తి పోలీస్ డిపార్ట్‌మెంట్‌ సర్వీస్‌కు అపాయింట్‌మెంట్‌కు అర్హులు కాదని పేర్కొంది. ఇది విధానపరమైన నిర్ణయమని.. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది.

హైకోర్టు తీర్పుపై సుప్రీంలో అప్పీల్

రాజస్థాన్ హైకోర్టు తీర్పుతో సంతృప్తి చెందని రామ్‌జీ ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ తీర్పుపై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించే వర్గీకరణ వివక్ష రహితమని, రాజ్యాంగ పరిధిలోనిదని పేర్కొంది. ఈ నిబంధన వెనుక ఉన్న లక్ష్యం కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది.

అక్టోబర్ 12, 2022 నాటి రాజస్థాన్ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా మాజీ సైనికుడు రామ్‌జీ లాల్ జాట్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నిబంధన పాలసీ పరిధిలోకి వస్తుందని పేర్కొంది. రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయం, రాజస్థాన్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తుది తీర్పును వెలువరించింది. ఇద్దరు పిల్లల నిబంధన సరైందేనని.. అందులో ఎలాంటి వివక్ష లేదని తెలిపింది. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ నిబంధన రాజ్యంగ ఉల్లంఘన కిందకు రాదని తేల్చి చెప్పింది. 

Follow Us:
Download App:
  • android
  • ios