భారత పౌరసత్వంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ... అసలు ఏమిటీ సెక్షన్ 6A?
భారత పౌరసత్వానికి సంబంధించిన సెక్షన్ 6A రాజ్యాంగబద్దతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో అసలు ఏమిటి సెక్షన్ 6A అనేది తెలుసుకుందాం.
భారత పౌరసత్వంకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పౌరసత్వ చట్టం, 1955 లోని సెక్షన్ 6A రాజ్యాంగబద్దతపై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ సెక్షన్ 6A కు చెల్లుబాటును నలుగురు న్యాయమూర్తులు సమర్దించగా, ఒక్కరు విబేధించారు. ఇలా 4;1 మెజారిటీతో ఈ సెక్షన్ 6A కు రాజ్యాంగబద్దత లభించింది.
అసలు ఏమిటీ సెక్షన్ 6A?
సెక్షన్ 6A ప్రకారం జనవరి 1,1996కి ముందు అస్సాంలోకి ప్రవేశించి సాధారణ నివాసముండే విదేశీయులకు భారత పౌరసత్వం లభిస్తుంది. ఆ తర్వాత అంటే బంగ్లాదేశ్ లో అంతర్యుద్దం సమయంలో బంగ్లాదేశ్ నుండి భారత్ లోకి భారీగా వలసలు కొనసాగాయి. ఇలా అస్సాంకు భారీగా బంగ్లాదేశీలు చేరుకున్నారు.
ఇలా అస్సాంకు చేరుకున్న విదేశీయులకు కూడా భారత పౌరసత్వం కల్పించింది రాజీవ్ గాంధీ ప్రభుత్వం. జనవరి 1, 1966 నుండి మార్చి25,1971 మధ్యకాలంలో అస్సాంలో ప్రవేశించిన విదేశీయులకు భారత పౌరసత్వం కల్పించారు.ఇందుకోసం 1985 ఆగస్ట్ 15న ఆనాటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ 'అస్సాం ఒప్పందం' పై సంతకం చేసారు. దీని ప్రకారం పౌరసత్వ చట్టం 1955 లో సెక్షన్ 6A చేర్చబడింది.
విదేశీయులకు పౌరసత్వంపై వివాదం :
బంగ్లాదేశ్ నుండి అస్సాంలోకి అక్రమంగా ప్రవేశించినవారు తమ సంస్కృతి, బాషను ప్రభావితం చేయడమే కాదు రాజకీయ హక్కులను హరిస్తున్నారంటూ 1979లో ఉద్యమం చెలరేగింది. ఇలా దాదాపు ఆరేళ్ల పాటు అస్సాంలో ఉద్యమం కొనసాగగా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఉద్యమకారులతో చర్చలు జరిపింది. ఇలా అస్సాం ఉద్యమకారులు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఓ ఒప్పందం జరిగింది. ఇలా 1985 లో అస్సాం-కేంద్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పంద ఫలితంగా 1986లో పౌరసత్వ చట్టాన్ని సవరించారు.
ఇలా సౌరసత్వ చట్ట సవరణపై కొంతకాలంగా వివాదం కొనసాగింది. దీంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు సూర్యకాంత్, ఎంఎం సుందరేష్, మనోజ్ మిశ్రా, జెబి పార్దివాలా తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సెక్షన్ 6A రాజ్యాంగబద్దతను నలుగురు న్యాయమూర్తులు సమర్దించగా కేవలం జస్టిస్ పార్ధివాలా విబేధించారు.