బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని పర్సనల్ లా అడ్డుకోలేవు : సుప్రీంకోర్టు
బాల్య వివాహ నిరోధక చట్టంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ కీలక ర్గదర్శకాలను జారీ చేసింది.
తెలిసీ తెలియని వయసులో పెళ్లి అనేక అనర్థాలకు దారితీస్తుంది. అందువల్లే పెళ్లికి కనీస వయసును నిర్ణయించారు. అయినప్పటికీ బాల్యవివాహాలు జరుగుతూనే వున్నాయి... వీటి నివారణకు తీసుకువచ్చిందే బాల్య వివాహ నిరోధక చట్టం. అయితే కొన్ని సందర్భాల్లో పర్సనల్ లా ఈ చట్టాన్ని ఉళ్లంఘించే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
బాల్య వివాహ నిరోధక చట్టాన్ని ఎలాంటి పర్సనల్ లా అడ్డుకోలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చిన్న వయసులో పెళ్లిళ్లంటేనే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్చ వుండదు. కాబట్టి బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని న్యాయస్థానం పేర్కొంది.
శుక్రవారం బాల్యవివాహ నిరోధక చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో దేశంలో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.
బాల్య వివాహాల కారణంగా చిన్నారుల హక్కులు హరించబడతాయని సుప్రీంకోర్టు పేర్కొంది. కాబట్టి అధికారులు మైనర్ బాలబాలికల వివాహాలు జరక్కుండా చూడాలని ఆదేశించారు. ఈ బాల్య వివాహాలు జరక్కుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
చిన్న వయసులో పెళ్లిళ్ల కారణంగా ఆరోగ్య మరియు సామాజిక సమస్యలను గుర్తించిన ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం 1929 లో బాల్య వివాహ నిరోధక చట్టాన్ని తీసుకువచ్చారు. అయితే 2006 లో దీని స్థానంలో నేటి పరిస్థితులకు తగినట్లుగా ఈ బాల్యవివాహ నిరోధక చట్టాన్ని రూపొందించారు. ఇదే ఇప్పుడు అమలులో వుంది.