ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసిన సుప్రీంకోర్ట్ .. సోషల్ మీడియాలో ప్రజల స్పందన , ఏమంటున్నారంటే..?
ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని, ఈ బాండ్ల జారీని తక్షణం బ్యాంకులు నిలిపివేయాలని సుప్రీం ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుపై బ్లూక్రాఫ్ట్ డిజిటల్ సీఈవో అఖిలేష్ మిశ్రా పలు ప్రశ్నలు సంధించారు.
మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ రాజకీయ పార్టీలకు సర్వోన్నత న్యాయస్థానం షాకిచ్చింది. పార్టీలకు నిధులు సమకూర్చుకునేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని, ఈ బాండ్ల జారీని తక్షణం బ్యాంకులు నిలిపివేయాలని సుప్రీం ఆదేశించింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఎలాంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడమంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని అత్యున్నత ధర్మాసనం అభిప్రాయపడింది.
అయితే సుప్రీంకోర్టు తీర్పుపై బ్లూక్రాఫ్ట్ డిజిటల్ సీఈవో అఖిలేష్ మిశ్రా పలు ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు చట్టపరమైన హామీ కింద పనిచేస్తున్న దాతల చట్టపరమైన హక్కుల పరిస్ధితి ఏంటీ..? దాతలు ఈ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసినప్పుడు, వారి పేర్లను వెల్లడించబోమని వారికి చట్టపరంగా హామీ ఇవ్వబడిందన్నారు. దీంతో వారు ఎలాంటి భయం లేకుండా విరాళాలు అందించారని అఖిలేష్ పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చెల్లుబాటును ప్రశ్నించిన ఆయన.. విరాళాలు ఇచ్చిన వారి పేర్లను వెల్లడించాలని సుప్రీం ఆదేశించిందన్నారు.
ఇది సార్వభౌమ చట్టపరమైన హామీల ఆధారంగా పనిచేస్తున్న దాతలు, భారత పౌరుల హక్కుల ఉల్లంఘన కాదా అని మిశ్రా ప్రశ్నించారు. పేర్లను మరో మార్గంలో బహిర్గతం చేయాలని సుప్రీం కోరవచ్చునని.. ఏ కొత్త దాత అయినా చట్టపరమైన పరిణామాల గురించి తెలుసుకునే అవకాశం ఉన్నందున ఇది బాగానే ఉండేదన్నారు. కానీ చట్టపరమైన దృక్కోణం నుండి పేర్లను బహిర్గతం చేయాలన్న ప్రకటన చాలా సందేహాస్పదంగా ఉందని మిశ్రా అభిప్రాయపడ్డారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై రెండు వేర్వేరు కానీ ఏకగ్రీవంగా తీర్పులు ఇచ్చింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం వాక్ స్వాతంత్య్రానికి, భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. పౌరుల గోప్యత ప్రాథమిక హక్కులో రాజకీయ గోప్యత, సహవాసం హక్కు కూడా ఉందని బెంచ్ పేర్కొంది.
ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని 2018 జనవరి 2న ప్రభుత్వం నోటిఫై చేసింది. రాజకీయ నిధుల్లో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలకు ప్రత్యామ్నాయంగా దీన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం నిబంధనల ప్రకారం.. ఎలక్టోరల్ బాండ్లను భారతదేశంలోని ఏ పౌరుడైనా లేదా దేశంలో విలీనం చేయబడిన లేదా స్థాపించబడిన ఏదైనా సంస్థ కొనుగోలు చేయవచ్చు. ఏ వ్యక్తి అయినా ఒంటరిగా లేదా ఇతర వ్యక్తులతో కలిసి ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు.