09:36 PM (IST) Aug 28

147 పరుగులకు పాక్ ఆలౌట్

ఆసియా కప్‌లో భాగంగా భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో పాకిస్తాన్ 147 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4, హర్డిక్ పాండ్యా 3 వికెట్లు తీశారు. పాక్ బ్యాట్స్‌మెన్‌లలో రిజ్వాన్ 43, ఇఫ్తికర్ 28 పరుగులు చేశారు. 

09:15 PM (IST) Aug 28

చవితి వేడుకలు.. ప్రభుత్వానికి సోము వీర్రాజు వార్నింగ్

వినాయక చవితి ఉత్సవాలకు నిబంధనల పేరిట ఆటంకాలు సృష్టించడం సరికాదన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఇలాంటి వాటిని మానుకోవాలని ఆయన హితవు పలికారు. గణేశ్ మండపాల ఏర్పాటుపై ఇలాగే వ్యవహరిస్తే ఉద్యమం చేస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు. 

08:34 PM (IST) Aug 28

ఆకాశ ఎయిర్‌పై హ్యాకర్ల దాడి

భారత్‌లో ఇటీవలే ప్రారంభమైన ఆకాశ ఎయిర్ హ్యాకర్ల బారినపడింది. సర్వర్లలోంచి పేర్లు, జెండర్ వివరాలు, ఈ మెయిల్ , ఫోన్ నెంబర్లను అపహరించారని సంస్థ తెలిపింది. దీనిపై ఆకాశ ఎయిర్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కి ఫిర్యాదు చేసింది. 

07:55 PM (IST) Aug 28

తొలి వికెట్ కోల్పోయిన పాక్

ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా ఆదివారం భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ బాబర్ ఆజామ్ భువనేశ్వర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

07:14 PM (IST) Aug 28

టాస్ గెలిచిన రోహిత్ శర్మ

ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా ఆదివారం భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోనున్నారు. చాలా రోజుల తర్వాత దాయాది దేశాల మధ్య మ్యాచ్ జరుగుతుండటంతో క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

06:41 PM (IST) Aug 28

తెలంగాణలో ముగిసిన కానిస్టేబుల్ పరీక్ష

తెలంగాణలో కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం రాష్ట్రంలోని 1,601 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 6,03,955 మంది అభ్యర్ధులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 

05:39 PM (IST) Aug 28

వినాయక మండపాలకు రుసుము : స్పందించిన ఏపీ సర్కార్

రాష్ట్రంలో వినాయక చవితి మండపాలకు రుసుములు వసూలు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ స్పందించింది. ఈ మేరకు ఏపీ ఎండోమెంట్స్ కమీషనర్ హరి జవహర్‌ లాల్ మాట్లాడుతూ.. వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయడం లేదని తెలిపారు. 

04:56 PM (IST) Aug 28

వాళ్లకు డబ్బులు చెల్లించండి: సుప్రీంకోర్ట్

నోయిడాలోని రియల్‌ ఎస్టేట్‌ సంస్థ సూపర్‌టెక్‌కు చెందిన 40 అంతస్తుల జంట టవర్లను నేడు కూల్చేశారు. ఈ కూల్చివేత ప్రక్రియ అంతా రెప్పపాటులో పూర్తయ్యింది. అయితే సూపర్‌టెక్‌ ట్విన్‌ టవర్స్‌లో ఫ్లాట్‌లు కొనుగోలు చేసేందుకు డబ్బులు చెల్లించి ఇంకా వాపసు పొందని వారి సంఖ్య అధికంగానే ఉంది.

04:15 PM (IST) Aug 28

అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 22న అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 17న అధ్యక్ష ఎన్నిక 

03:43 PM (IST) Aug 28

డైరెక్టర్ బాబీ తండ్రి కన్నుమూత

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కేఎస్ రవీంద్ర తండ్రి మోహన రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఇటీవల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మోహనరావు ఈరోజు కన్నుమూశారు. రేపు గుంటూరులో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

03:13 PM (IST) Aug 28

మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆఫీస్ బాయ్ ఆత్మహత్య

తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్న దేవేందర్ (19) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఓ మహిళతో సన్నిహితంగా మెలిగాడని.. ఆత్మహత్యకు ముందు ఆమెకు దేవేందర్ మెసేజ్ పంపించాడని పోలీసులు తెలిపారు. 

02:43 PM (IST) Aug 28

నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత

నోయిడాలో కుతుబ్ మినార్ కంటే ఎత్తైన సూపర్‌టెక్ ట్విన్ టవర్స్‌ను ఈరోజు కూల్చివేశారు. కేవలం 10 సెకన్ల వ్యవధిలోనే ట్విన్స్ టవర్స్ పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా దుమ్ము, ధూళి ఆవవరించింది. 

12:59 PM (IST) Aug 28

అవసరమైతే సోనాలి హత్య కేసు సిబిఐకి...: గోవా సిఎం సావంత్

ఇటీవల గోవాలో హత్యకు గురయిన హర్యానా బిజెపి నాయకురాలు సోనాలీ పోగట్ హత్య కేసు సంచలనంగా మారింది. దీంతో అవసరమైతే ఈ కేసును సిబిఐకి అప్పగించనున్నట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. 

11:58 AM (IST) Aug 28

టిఎంసి పార్టీకి బిగ్ షాక్... త్రిపుర ఉపాధ్యక్షుడి రాజానామా

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసి) కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటయిన త్రిపురకు చెందిన ఆ పార్టీ ఉపాధ్యక్షుడు అబ్దుల్ బాసిత్ శనివారం రాజీనామా చేసాడు. టిఎంసి పార్టీతో పాటు ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు బాసిత్ ప్రకటించారు. 


11:32 AM (IST) Aug 28

గులాం నబీ అజాద్ కు ఇప్పుడు నిజమైన 'అజాద్' : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులన్నింటికి గులాం నబీ అజాద్ రాజీనామా చేయడంపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు గులాం నబీ అజాద్ నిజంగానే ''అజాద్'' (స్వేచ్చ కలిగిన వ్యక్తి) అయ్యారన్నారు. అయితే ఇలాగే అమేథీ పరిస్థితి కూడా వుండేదని... చాలా కాలం క్రితమే విముక్తి లభించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 

10:35 AM (IST) Aug 28

దాయాది పాక్ మ్యాచ్ కు ముందు టిమిండియాకు గుడ్ న్యూస్

దాయాది పాకిస్టాన్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. కరోనా బారినపడ్డ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కోలుకున్నట్లు... తాజాగా ఆయనకు టెస్ట్ చేయగా నెగెటివ్ గా తేలినట్లు బిసిసిఐ ప్రకటించింది. దీంతో ఆసియా కప్ కోసం దుబాయ్ లో వున్న టీమిండియాతో ద్రవిడ్ కలవనున్నట్లు బిసిసిఐ తెలిపింది. 

09:30 AM (IST) Aug 28

కర్ణాటకలో రూ.100 కోట్ల డ్రగ్స్ సీజ్... పట్టుబడ్డ తెలంగాణ స్మగ్లర్లు

విదేశాల నుండి దేశానికి తరలించిన భారీగా డ్రగ్స్ కర్ణాటకలో పట్టుబడింది. బెంగళూరు సమీపంలో దాదాపు రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇథియోపియా నుండి తీసుకువచ్చిన 14 కిలోల డ్రగ్స్ ను డిల్లీకి తరలిస్తున్న తెలంగాణకు చెందిన స్మగ్లర్లు పట్టుబడ్డారు.

09:23 AM (IST) Aug 28

నిజామాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం

నిజామాబాద్ లో ఘోర ఆగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని టీమార్ట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి అంతకంతకు ఎగసిపడుతూ షాప్ మొత్తాన్ని దగ్దం చేసాయి. ఈ అగ్నిప్రమాదం కారణంగా రూ.2 కోట్ల ఆస్తినష్టం జరిగిందని యజమానులు తెలిపారు.