మరో నాలుగు గంటల్లో పెళ్లి పీటలు ఎక్కి... వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాల్సిన యువకుడు తనవు చాలించాడు. యువతి మెడలో పసుపు తాడు కట్టాల్సిందిపోయి.. తన మెడకి ఉరితాడు బిగించుకున్నాడు. ఈ విషాదకర సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... బెంగళూరుకి చెందిన యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. నీ ఈ మధ్యే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతడ్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి కాంప్రమైజ్ చేసి పంపించారు. కొద్దిరోజులు ఇద్దరు బాగానే ఉన్నారు. 

కొద్ది రోజుల అనంతరం యువతీ మళ్లీ ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పట్టించుకోవడం లేదని... ఫోన్ నెంబర్ మార్చేశాడని.. తనను అత్యాచారం కూడా చేశాడని ఆరోపించింది. దీనిపై పోలీసులు యువకుడిని ప్రశ్నించగా.. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అక్కడి నుంచి డైరెక్ట్ గా రిజిస్టర్ ఆఫీసుకి తీసుకువెళ్లి పెళ్లి చేసుకుంటామని కూడా చెప్పారు.  గత నెల 31 (శుక్రవారం)న వివాహం చేసుకోవాలనుకుంటున్నామని చెప్పారు. తమ పెళ్లిని రిజిస్టర్ చేయాలని కోరారు. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామనుకున్నారు. 

పెళ్లి రోజు రానే వచ్చింది... కొన్ని గంటల్లో పెళ్లి అనగా యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువతి ప్రతి విషయానికీ వేధిస్తోందని... అవి తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నాడని యువకుడు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.