ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలో రెండోసారి ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ముందు మిత్రపక్షం శివసేన పలు డిమాండ్లను ఉంచింది. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు మూడు కీలక డిమాండ్లను బీజేపీ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షాకు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే తెలిపారు.

తమ డిమాండ్లపై మోడీ ప్రభుత్వం సానుకులంగా స్పందిస్తుందని భావిస్తున్నామని శివసేన పార్లమెంటరీ పార్టీ నేత సంజయ్ రావత్ ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్‌సభలో బీజేపీకి సొంతంగా మెజారిటీ దక్కడం సంతోషమే అయినా.. మిత్రపక్షాల బలాబలాలను కూడా గుర్తించడం కీలకమని రావత్ అభిప్రాయపడ్డారు.

లోక్‌సభలో 18 మంది, రాజ్యసభలో ముగ్గురు సభ్యులు కలిగిన తమ పార్టీకి కేవలం ఒక్క మంత్రి పదవినే కట్టబెట్టడం సరికాదని.. కేబినెట్ విస్తరణలో తమకు సముచిత స్థానం దక్కాలని ఆయన డిమాండ్ చేశారు.