న్యూఢిల్లీ: ఇరవై ఏళ్ల నాటి అత్యాచారం కేసులో నిందితుడిని సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఆ వ్యక్తి, తనపై అత్యాచారం జరిగిందని ఆరోపించిన మహిళ ఆ సమయంలో ప్రేమలో ఉన్నారని, పరస్పర అంగీకారంతోనే సంబంధంలోకి వచ్చారని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 

ఆ వ్యక్తి మరో మహిళను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడడంతో మహిళ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించిందని సుప్రీంకోర్టు తెలిపింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షను న్యాయమూర్తులు ఆర్ఎఫ్ నారిమాన్, నవీన్ సిన్హా, ఇందిరా బెనర్జీలతో కూడిన బెంచ్ పక్కన పెట్టేసింది. 

1999లో కేసు నమోదు చేసినప్పుడు మహిళకు 25 ఏళ్లు ఉన్నాయని, ఆమె చెప్పినట్లుగా 20 ఏళ్లు కాదని, 1995లో తనపై అత్యాచారం జరిగిందని ఆమె చెబుతోందని, అయితే అది నిజం కాదని, సంఘటన జరిగినప్పుడు ఆమె మేజర్ అని జార్ఖండ్ కోర్టు వైద్య నిపుణులు చెప్పిన విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. 

ఇరువురు రాసుకున్న లేఖలను, పంపించుకున్న ఫొటోలను బట్టి చూస్తే వారిద్దరు ప్రేమించుకున్నారనేది తెలిసిపోతోందని, అందువల్ల అత్యాచారమూ మోసమూ అనే ప్రస్తావన రాదని, మరో మహిళను అతను పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసిన వారం రోజుల ముందు మహిళ కేసు పెట్టిందని సుప్రీంకోర్టు వివరించింది.

పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడం వల్ల తాను తనపై జరిగిన దాడి గురించి మౌనంగా ఉండిపోయానని మహిళ చెప్పింది.