‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై నివేదిక.. రాష్ట్రపతికి అందజేసిన రామ్ నాథ్ కోవింద్..
దేశంలో ఒకే సారి ఎన్నికలు నిర్వహించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు అయిన కమిటీ తన నివేదికను సమర్పించింది. 18 వేలకు పైగా పేజీలు ఉన్న ఈ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందించింది.
దేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించడానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది. వన్ నేషన్ వన్ పోల్ (ఓఎన్ ఓపీ)పై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ గురువారం రాష్ట్రపతిని కలిసి తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో మొత్తం 18,626 పేజీలు ఉన్నాయి.
ఈ కమిటీ దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రాజ్యాంగంలోని చివరి ఐదు అధికరణలను సవరించాలని కమిటీ సిఫారసు చేసింది. ప్రతిపాదిత నివేదికలో లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఒకే ఓటరు జాబితాను రూపొందించడంపై దృష్టి సారించాలని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ చట్రాన్ని దృష్టిలో ఉంచుకుని లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి గత సెప్టెంబర్ లో ఏర్పాటైన ఈ కమిటీ పరిశీలించి సిఫార్సులు చేసింది.
ఈ నివేదిక తొలి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సమాచారం అందించారు. రెండో దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోగా ఆయా సంస్థలకు ఎన్నికలు నిర్వహించే విధంగా మున్సిపాలిటీలు, పంచాయతీలను లోక్‌సభ, శాసనసభలతో అనుసంధానం చేయాలని కోరారు.
అసలేంటి వన్ నేషన్.. వన్ ఎలక్షన్..
ఒకే దేశం, ఒకే ఎన్నికలు అంటే దేశంలోని అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాల్సి ఉంటుంది. నిజానికి స్వాతంత్య్రం వచ్చిన కొన్నాళ్లకు లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అయితే ఆ తర్వాత అసెంబ్లీల రద్దు, ప్రభుత్వ పతనం కారణంగా ఈ సంప్రదాయానికి బ్రేక్ పడింది. దీంతో పలు రాష్ట్రాల్లో వివిధ సమయాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఒకే సారి ఎన్నికలు జరగడం వల్ల దేశంలో ప్రతి ఏటా జరిగే ఎన్నికలకు వెచ్చించే భారీ మొత్తం ఆదా అవుతుందని అంచనా..
కాగా.. జమిలీ ఎన్నికల కోసం మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు అయిన ఈ కమిటీలో హోం మంత్రి అమిత్ షా, రాజ్యసభలో ప్రతిపక్ష మాజీ నేత గులాం నబీ ఆజాద్, ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్కే సింగ్, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే సభ్యులుగా ఉన్నారు. లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరిని కూడా కమిటీలో సభ్యుడిగా నియమించినప్పటికీ ఆయన నిరాకరించారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నారు.