లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమి కాంగ్రెస్‌పై పెను ప్రభావాన్ని చూపుతోంది. పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామాకు సిద్ధపడగా.. పలు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు ఇప్పటికే రాజీనామా చేశారు.

కాగా రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన కుమారుడి ఓటమితో కుమిలిపోతున్నారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరొందిన జోధ్‌పూర్ నుంచి పోటీ చేసిన గెహ్లాట్ కుమారుడు వైభవ్.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతిలో ఓడిపోయారు.

తన కొడుకు ఓటమికి ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలటే కారణమని గెహ్లాట్ అనుచరులు ఆరోపిస్తున్నారు. వైభవ్ తనకు పోటీగా ఎదుగుతారనే దురుద్దేశ్యంతోనే సచిన్ పావులు కదిపారని మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో వైభవ్ ఓటమికి బాధ్యత వహించాలని సచిన్‌ పైలట్‌ను సీఎం డిమాండ్ చేశారు. జోధ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని సచిన్ తనను నమ్మించారని, కానీ ఫలితాలు మాత్రం అనుకూలంగా రాలేదని అశోక్ గెహ్లాట్ వాపోయారు.

అయితే  అశోక్ తన కుమారుడి గెలుపు కోసమే ఆతృతపడ్డారని.. పార్టీ విజయానికి ఏమాత్రం కృషి చేయలేదని రాహుల్ గాంధీ సైతం ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో త్వరలోనే రాష్ట్ర పార్టీని ప్రక్షాళన చేయాలని హైకమాండ్ భావిస్తోంది. అయితే అశోక్ వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి.