శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో ఇద్దరు హీరోయిన్లు  సంజనా, రాగిణి ద్వివేదిలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. వీరిద్దరూ విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. రాగిణి, సంజనకు డోప్ పరీక్ష చేసిన రిజల్టుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇదే కేసులో రాగిణి డోప్ టెస్ట్ శాంపిల్స్‌ను ట్యాంపర్ చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. యూరిన్ పరీక్ష చేయాలని భావించగా.. ఆమె అందులో నీరు కలిపినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు వారి కేశాలను పరీక్షకు పంపించారు. అయితే డోప్ టెస్ట్ కోసం వారి శాంపిల్స్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. 

మరోవైపు కోర్టులోనూ ఈ  ఇద్దరు హీరోయిన్లకు నిరాశ తప్పడంలేదు. రాగిణి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. తనకు వెన్నునొప్పి ఉందని, ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేసుకునేందుకు బెయిల్ ఇవ్వాలని కోరింది. దీనికి కోర్టు అనుమతించలేదు. రాగిణికి మరో 14 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీకి ఇచ్చింది. ఆమెతోపాటు మరో నలుగురు సిమోన్, నియాజ్, రంకా, రాహుల్‌లకు జ్యూడీషియల్ కస్టడీకి అనుమతించింది. అయితే సంజనను విచారించేందుకు అనుమతి ఇవ్వాలన్న సీసీబీ అధికారుల అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అందుకు మరో ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీని పొడిగించింది.