కోయంబత్తూర్: అత్యంత గుట్టుగా నిర్వహిస్తున్న వ్యభిచారం వ్యవహారాన్ని పోలీసులు రట్టు చేశారు. లాడ్జీలో అద్దం చాటున ఓ సీక్రెట్ రూంను ఏర్పాటు చేసి అందులో ఓ మహిళను బందీ చేసి, ఆమెతో వ్యభిచారం చేయిస్తున్న వైనం వెలుగు చూసింది. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. 

తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు కోయంబత్తూరులోని మెట్టుబాలసయం సబ్ డివిజన్ లోని కల్లార్ సమీపంలో గల శరణ్య లాడ్జీపై దాడి చేశారు. డ్రెసింగ్ అద్దం వెనక రహస్య గదిని పోలీసులు కనిపెట్టారు. ఆ రహస్యమైన గదిలో సింగిల్ మంచం, ఓ పరుపు ఉన్నాయి. 

ఆ గదిలో 22 ఏళ్ల వయస్సు గల మహిళను బందీ చేశారు. ఆ మహిళ మూడు రోజుల క్రితమే బెంగళూరు నుంచి కోయంబత్తూరు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మహిళను పోలీసులు షెల్టర్ హోంకు పంపించారు. లాడ్జీని సీల్ చేశారు. 

లాడ్జి యజమాని మహేంద్రన్, రూంబాయ్ గణేశన్ లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిద్దరు గత మూడేళ్లుగా ఆ గదిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కరోనా వైరస్ కారణంగా లాడ్జీ మూసేసినప్పటికీ ఆ గదిలో వ్యభిచారాన్ని కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.