లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ లో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తనతో మాట్లాడినట్టుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. 

గ్యాంగ్ రేప్ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రధాని మోడీ చెప్పారని యూపీ సీఎం తెలిపారు.19 ఏళ్ల దళిత బాలికను కొందరు వ్యక్తులు సామూహికంగా అత్యాచారం చేశారు.  తీవ్ర గాయాలపాలైన బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు మరణించింది.

 

ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. యూపీలో విపక్షాలు యోగి సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి.పొలంలో పనిచేస్తున్న బాలికను లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆ బాలికకు చిత్రహింసలు పెట్టారు. బాలికను చిత్రహింసలకు గురి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళనలు చేలరేగుతున్నాయి. 

ఈ ఘటనలో నిందితులు ఎవరైనా వారిని వదిలిపెట్టబోమని యోగి సర్కార్ ప్రకటించింది. ఈ ఘటనపై యోగి సర్కార్ పై కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.