Asianet News TeluguAsianet News Telugu

నా భార్యతో కలిసే.. ముగ్గురం కాపురం చేసుకుందాం

‘ఆమెతో గత జన్మ అనుబంధం గురించి భార్యకు చెప్పి ఒప్పించానని..ఆమె తనతో వస్తే ముగ్గురం కలిసే కాపురం చేసుకుంటామంటూ’ కొత్త కథలు అల్లడం ఆరంభించాడు. 

odisha poet sexually harrassed central government employee

సమాజంలో పేరున్న వ్యక్తి.. బుద్ధి మాత్రం పశువు కన్నా నీచం. ఏదో ఓ కార్యక్రమంలో పరిచయం అయిన యువతిని నానా రకాలుగా హింసించాడు. గత జన్మలో ఆమె తన భార్య అని.. ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకోవాలని వేధించాడు. చివరకు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవి.. కేరళలో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నాడు. తన కవితలతో ప్రసిద్ధి చెందిన అతడు రాజేంద్రనగర్‌లోని ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థలో జరిగిన కవి సమ్మేళనానికి గతంలో హాజరయ్యాడు. ఆ సమయంలో ఓ ఉద్యోగినితో ఏర్పడిన పరిచయాన్ని.. సామాజిక మాధ్యమాల్లో సంభాషణలు కొనసాగించే వరకు తీసుకొచ్చాడు. క్రమేపీ అతడి వైఖరిలో మార్పు రావడం గమనించిన ఆమె.. అతనితో చాట్‌ చేయడం మానేయడంతో వేధించడం ఆరంభించాడు

తనతోపాటు ఆ ఉద్యోగిని పేరు కలిసి వచ్చేలా ఓ సామాజిక మాధ్యమ ఖాతాను ప్రారంభించాడు. ఆ ఉద్యోగినితో పరిచయం ఏర్పడిన నాటి నుంచి తనలో కలిగిన అనుభూతులను అందులో పంచుకోవడం (షేర్‌ చేయడం) ఆరంభించాడు. ‘పూర్వ జన్మలో ఆమె నా భార్య. ఈ జన్మలోనూ మా మనసులు కలిశాయి. మా బంధం ఎన్ని జన్మలకైనా కొనసాగుతుంది. ఆమెను చూడటంతోనే గతం తాలూకు జ్ఞాపకాలు నాలో మేల్కొన్నాయి..’ ఈ తరహాలో అతని రాతలు కొనసాగాయి. అంతటితో ఆగకుండా జమ్మూకశ్మీర్‌లో బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులనూ కలిశాడు. 

ఆమెపై తనకు కలిగిన భావాలను పంచుకోవడంతో వాళ్లు విస్మయానికి గురయ్యారు. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. అయినా అతని తీరుమారలేదు సరికదా.. ‘ఆమెతో గత జన్మ అనుబంధం గురించి భార్యకు చెప్పి ఒప్పించానని..ఆమె తనతో వస్తే ముగ్గురం కలిసే కాపురం చేసుకుంటామంటూ’ కొత్త కథలు అల్లడం ఆరంభించాడు. 

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు గతేడు ఆగస్టులో అతణ్ని కేరళలోనే అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. ఆ సమయంలో పద్ధతి మార్చుకుంటానంటూ పోలీసుల ఎదుట అంగీకరించడంతో అతని అరెస్టు విషయాన్ని వాళ్లు గోప్యంగా ఉంచారు. తాజాగా అతగాడు అదే తరహా వేధింపులు ఆరంభించడంతో బాధితురాలు మరోమారు సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios