ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి  నవ కిశోర్ దాస్ కుమార్తె దీపాలి దాస్... ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. నిషేధిత ప్రాంతంలో ఆమె ఫోటోలు దిగడమే  దానికి కారణం. హీరాకుడ్ జలాశయం నిషేధిత ప్రాంతంలో ఫోటో, వీడియోలు తీసుకోవడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. 

మంత్రి కుమార్తెతో పాటు మరో ముగ్గురు యువతులు ఈ వీడియోలో ఉన్నారు. వీరంతా సినిమా, ఆల్బమ్‌లలో నటిస్తుంటారు. హీరాకుడ్‌ జలాశయం నిషేధిత ప్రాంతంలో వీరంతా ఫొటోలు తీసుకుని వీడియో రికార్డింగ్‌ చేశారు. కాగా విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది మినహా ఇతరులను అనుమతించని నిషేధిత ప్రాంతంలోకి ఈ యువతుల బృందం చేరడం ఎలా సాధ్యమైందనే విషయంపై చర్చ సాగుతోంది. 

వీడియో రికార్డింగు సమయంలో నిషేధిత ప్రాంతంలో కార్లు  ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తన కూతురుకి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంపై మంత్రి నవ కిషోర్‌దాస్‌ స్పందించారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారి పట్ల చట్టం తన పని తాను చేస్తుందని మంత్రి మాట దాట వేశారు.

కాగా... మంత్రి కుమార్తె దీపాలీ దాస్ , ఆమె స్నేహితురాళ్లలు ఉన్నారు. ఆల్బమ్‌ షూటింగును పురస్కరించుకుని వీరంతా ముందస్తు అనుమతి లేకుండా హీరాకుడ్‌ జలాశయం నిషేధిత మహానది తీరానికి వెళ్లినట్లు ఆరోపణ బలం పుంజుకుంటోంది. ఈ సంఘటనపై విచారణకు సంబల్‌పూర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ కన్వర్‌ విశాల్‌ సింగ్‌ ఆదేశాలు జారీ చేశారు