ఆ ఘటన జరిగి రెండు దశాబ్దాలు పూర్తయ్యింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం సంచలనం సృష్టించిన గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఐఎఫ్ఎస్ అధికారి మాజీ భార్య అత్యాచారానికి గురైన కేసులో ప్రధాన నిందితుడిని మహారాష్ట్ర లో అరెస్టు చేశారు.

1999లో జరిగగిన ఈ కేసు తీవ్ర సంచలనం సృష్టించడమే కాకుండా.. అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి రాజీనామా చేయడానికి కారణమయ్యింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే...

ఒడిశాలో 1999లో ఐఎఫ్ఎస్ అధికారి మాజీ భార్య భువనేశ్వర్ నుంచి కటక్ వెళ్తుండగా ముగ్గురు దుండగులు ఆమెను అడ్డుకున్నారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం పరారయ్యారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు కారణమయ్యింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం ఈ కేసును ఒడిశా హైకోర్టు సీబీఐకి అప్పగించింది.

దర్యాప్తు జరిపిన సీబీఐ ఈ కేసులో ముగ్గురు నిందితులేనని తేల్చింది. వీరిలో ఇప్పటికే ఇద్దరికి శిక్ష పడగా వారిలో ఒకరు ఇటీవల ప్రాణాలు కోల్పోయాడు. కానీ.. ప్రధాన నిందితుడు బిబేకానంద బిశ్వాల్ మాత్రం 20 సంవత్సరాలుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. పేరు మార్చుకొని.. మహారాష్ట్రలోని లోనావాలాలో తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో.. వెంటనే పకడ్బందీగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది కాబట్టి.. నిందితుడిని వాళ్లకు అప్పగిస్తామంటూ పోలీసులు చెప్పడం గమనార్హం.