మరదలిపై మోజు అతనిని రాక్షసుడిగా మార్చేసింది. పెళ్లైన మరదలిని తాను దక్కించుకోవాలి అంటే... తోడల్లుడు ఉండకూడదు అనుకున్నాడు. పథకం ప్రకారం తోడల్లుడిని అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నెల్లూరుకు చెందిన సత్యప్రసాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేసేవాడు. ఇతడికి 2006లో గుంటూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌తో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు మాదాపూర్‌లో ఉంటూ వేర్వేరు కంపెనీల్లో పని చేస్తున్నారు. సత్య ప్రసాద్ భార్య కి ఓ సోదరి ఉంది. ఆమె పేరు శ్రీజ కాగా..  ఆమెకు లక్ష్మణ్‌కుమార్‌తో 2016లో వివాహం జరిగింది. 

ఆమె కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావడంతో ప్రస్తుతం భార్యభర్తలు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. కొన్నాళ్లుగా శ్రీజపై కన్నేసిన సత్య ప్రసాద్ ఆమెను లోబరుచుకోవాలని భావించాడు. ఈ విషయం మరదలి కి కూడా చెప్పని అతను లక్ష్మణ్‌ కుమార్‌ను హత్య చేస్తే ఆమె తనకు సొంతమవుతుందని భావిం చాడు. 

దీంతో పలుమార్లు బెంగళూరు వెళ్లిన సత్యప్రసాద్  హత్యలు చేసే ముఠాల కోసం ప్రయత్నించాడు. లక్ష్మణ్‌ ఇల్లు, కార్యాలయానికి సంబంధించిన లోకేషన్స్‌ను తన వాట్సాప్‌లో సేవ్‌ చేసుకున్నాడు. ఓ ముఠాకి దాదాపు రూ.15లక్షలు డబ్బులు ఇచ్చి మరీ లక్ష్మణ్ ని చంపేందుకు ప్లాన్ వేశాడు.

Also Read స్పా పేరిట వ్యభిచారం... గుట్టు రట్టు చేసిన పోలీసులు...

2 కార్లు, 4 బైక్‌లతో రంగంలోకి దిగిన ఈ ముఠా గత నెల 30, 31 తేదీల్లో లక్ష్మణ్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ నెల 3న లక్ష్మణ్‌ ఇంటి వద్ద కాపుకాసిన ఈ గ్యాంగ్‌ అతడు ఆఫీస్‌కు బయలుదేరినప్పటి నుంచి వెంబ డించింది. మహదేవ్‌పుర ఫ్లైఓవర్‌ వద్ద అతడిని అడ్డగించి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న సత్య ప్రసాద్ ఏమీ ఎరుగనట్లు తన భార్యను తీసుకుని హుటాహుటిన బెంగళూరు వెళ్లాడు.

పోలీసులకు కూడా అతనే ఫిర్యాదు చేశాడు. అయితే... పోలీసుల విచారణలో సత్య ప్రసాదే ఈ హత్య చేయించినట్లు తేలడంతో అందరూ షాకయ్యారు. సీసీ కెమేరాల ఆధారంగా నిందితులను పట్టుకొని విచారించగా... వారు నేరం అంగీకరించారు. వారు చెప్పిన వివరాలతో పోలీసులు సత్య ప్రసాద్ ని అదుపులోకి తీసుకున్నారు. మరదలిపై మోజుతోనే ఇలా చేశానని సత్యప్రసాద్ నిజం ఒప్పుకున్నాడు.