Asianet News TeluguAsianet News Telugu

నిర్భయ కేసు: తలను గోడకేసి కొట్టుకున్న దోషి వినయ్ శర్మ

నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లో ఒక్కడైన వినయ్ శర్మ తలను తీహార్ జైలులోని సెల్ లో గోడకేసి బాదుకున్నట్లు తెలుస్తోంది. దానివల్ల అతని తలకు గాయమైందని, వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారని సమాచారం.

Nirbhaya convict hits head against wall to hurt self
Author
Delhi, First Published Feb 20, 2020, 8:55 AM IST

న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులోని నలుగురు దోషుల్లో ఒక్కడైన వినయ్ శర్మ తీహార్ జైలులో తలను గోడకేసి కొట్టుకున్నాడు. తీహార్ జైలులోని నంబర్ 3 సెల్ లో ఉన్న వినయ్ శర్మ సోమవారంనాడు ఆ పనికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. 

దోషులపై ఓ కన్ను వేసి ఉంచిన జైలు వార్డెన్స్ ఇంచార్జీ వినయ్ శర్మను ఆపడానికి ప్రయత్నించినట్లు జైలు అధికారులు చెప్పారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అతనికి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జీ చేసినట్లు తెలుస్తోంది.

See video: మార్చి 3 ఉరిశిక్షకు చివరి తేదీ అవ్వాలి : తాజా డెత్ వారెంట్‌పై నిర్భయ న్యాయవాది

సెల్ గ్రిల్స్ మధ్య చేతులో పెట్టి గాయం చేసుకోవడానికి వినయ్ శర్మ ప్రయత్నించాడని విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. ఆ సంఘటన ఫిబ్రవరి 16వ తేదీన జరిగిందని, వినయ్ శర్మ తనను గుర్తించలేకపోయాడని అతని తల్లి చెప్పిందని వినయ్ శర్మ తరఫు న్యాయవాది ఏపీ సింగ్ చెప్పాడు. తాజా డెత్ వారంట్ జారీ నేపథ్యంలో వినయ్ శర్మ మానసిక పరిస్థితి పూర్తిగా చెడిందని ఆయన అన్నారు. 

కౌన్సెలింగ్ చేసే సమయంలో అటువంటి సూచనలేవీ కనిపించలేదని జైలు అధికారులు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. అతని ఆరోగ్యానికి ఏ మాత్రం డోకా లేదని, ఇటీవల నిర్వహించిన సైకోమెట్రీకి సానుకూలంగా స్పందించాడని వారన్నారు. 

తాజా డెత్ వారంట్ జారీ అయిన నేపథ్యంలో దోషులు జైలు జైలు వార్డెన్స్, గార్డుల పట్ల అగ్రెసివ్ గా ప్రవర్తిస్తున్నారని వారంటున్నారు. వాళ్ల ప్రవర్తనలో మార్పు వచ్చిందని చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు సాధారణంగానే ఉన్నాయని వారన్నారు. చాలా సేపు ప్రయత్నిస్తే గానీ శర్మ, ముకేష్ సింగ్ ఆహారం తీసుకోలేదని వారన్నారు. 

See video: 2012 నిర్భయ కేసు : నలుగురు దోషులకు మార్చి 03 న ఉదయం 6 గంటలకు ఉరి

దోషులు ఆత్మహత్యలు చేసుకోకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 24 గంటలు సిసీటీవీ కెమెరాల ద్వారా వారిని పర్యవేక్షించే బాధ్యతను వార్డెన్స్ కు అప్పగించారు. వారి సెల్స్ వెలుపల గార్డులను పెట్టి కాపు కాస్తున్నారు. ఇతర ఖైదీలతో వారు ఎక్కువ సేపు మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

తల్లిదండ్రులను కలవడానికి అవకాశం ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఆ భేటీలను దోషులు తిరస్కరిస్తున్నారు. మానసికంగా అప్రమత్తంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios