కోయంబత్తూర్: కేరళలో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. 16 ఏళ్ల అమ్మాయిపై 9 మంది రెండేళ్లుగా అత్యాచారం చేస్తూ వస్తున్నారు. వారిని పొల్లాచి ఆల్ వుమెన్ పోలీసులు శనివారంనాడు అరెస్టు చేశారు. గురువారంనాడు ఆ అమ్మాయి అదృశ్యం కావడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. 

అరెస్టయినవారిని ఎ అమానుల్లా (27), టి భాగవతి అలియాస్ మొహమ్మద్ ఆసిఫ్, ఎ మొహమ్మద్ రఫీక్ (28), జె సయ్యద్ ఇబ్రహీం (25), ఎ మొహమ్మద్ అలీ, కె డేవిడ్ అలియాస్ సెంతిల్ కుమార్ (30), ఇర్షాద్ బాషా (28), మొహమ్మద్ ఖాన్ (44)లుగా గుర్తించారు. పొల్లాచికి చెందినవారు. మరో నిందితుడు ఎన్ అరుణ్ నెహ్రూ (28) తిరుపూర్ కు చెందినవాడు. 

బాధితురాలు పొల్లాచి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయి. పదో తరగతి మధ్యలో చదువు ఆపేసింది. రెండేళ్ల వయస్సులో ఉండగా ఆమె తల్లి మరణించింది. తండ్రి మరో పెళ్లి చేసుకోవడంతో నానమ్మ వద్ద ఉంటోంది. 

అమానుల్లా బుజ్జగించి అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత మిత్రులకు అవకాశం కల్పించాడు. గురువారంనాడు అమానుల్లా బాలికను తీసుకుని వెళ్లి ఆమెపై తన మిత్రుడు భగవతితో కలిసి రేప్ చేశాడు. 

తనను ఇంటి వద్ద దింపాలని బాధితురాలు వేడుకున్నా వినకుండా మరో మిత్రుడు ప్రభును రేప్ చేయడానికి పిలిచారు. బాలిక బంధువుకు విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల్లో తనపై తొమ్మిది మంది రెండేళ్లుగా రేప్ చేస్తున్నారని బాలిక పోలీసులకు తెలిపింది. ప్రభు కోసం పోలీసులు గాలిస్తున్నారు.