అమలులోకి కొత్త టెలికం చట్టం... సిమ్ కార్డుల పరిమితి దాటితే జరిమానా ఎంతో తెలుసా..?
దేశ వ్యాప్తంగా కొత్త టెలికం చట్టం అమలులోకి వచ్చింది. దీంతో పాత రూల్స్ మారిపోయాయి. ఇక నుంచి పరిమితికి మంచి సిమ్ కార్డులు కలిగి ఉంటే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, వేరొకరి ధ్రువపత్రాలతో సిమ్ కార్డులు తీసుకుంటే జైలుకు కూడా వెళ్లాల్సి రావచ్చు.
దేశంలో కొత్త టెలీ కమ్యూనికేషన్ చట్టం-2023 అమలులోకి వచ్చింది. నేటి (జూన్ 26) నుంచి కొత్త టెలికం చట్టంలోని నిబంధనలు దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చాయి.
దీంతో ఇప్పటి వరకు ఉన్న పురాతన ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం-1885, వైర్‌లెస్ టెలిగ్రాఫీ చట్టం-1993 స్థానంలో టెలి కమ్యూనికేషన్స్ చట్టం- 2023 అమలులోకి వచ్చింది. కొత్త చట్టం ద్వారా టెలికమ్యూనికేషన్స్ రంగం గణనీయమైన సాంకేతిక పురోగతి అందిపుచ్చుకోనుంది.
నేటి (జూన్ 26) నుంచి టెలికమ్యూనికేషన్స్ చట్టం- 2023లోని సెక్షన్లు 1, 2, 10 నుంచి 30, 42 నుంచి 44, 46, 47 వరకు, అలాగే 50 నుంచి 58 వరకు, 61, 62 వరకు ఉన్న నిబంధనలలు అమలులోకి వస్తాయి. ఈ మేరకు కొత్త చట్టానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారం, జాతీయ భద్రత ప్రయోజనాల పరిరక్షణ, యుద్ధ సమయాల్లో టెలి కమ్యూనికేషన్ల నెట్‌వర్క్‌లు లేదా సేవలను కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకోవడంతో పాటు నిర్వహిస్తుంది. స్పామ్, హానికారక కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించడం తప్పనిసరి అయింది. కొత్త చట్టంలోని నిబంధనల అమలుతో యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అనేది 'డిజిటల్ ఇండియా ఫండ్'గా మారిపోతుంది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో టెలికం సేవల స్థాపన, పరిశోధన, అభివృద్ధి పైలట్ ప్రాజెక్టుల స్థాపనకు దోహదపడుతుంది.
కొత్త రూల్స్ స్పామ్, ఇతర కమ్యూనికేషన్ సేవల నుంచి వినియోగదారులను రక్షించడానికి కూడా ఆదేశాలు జారీ చేస్తాయి. ఈ విభాగాల అమలు టెలికాం నెట్‌వర్క్‌లకు (Telecom Network) వివక్షత లేని, గుత్తాధిపత్య రహిత మార్గాన్ని కట్టడి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఛానెల్‌లు, కేబుల్ కారిడార్‌లను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది. టెలికమ్యూనికేషన్స్ బిల్లు 2023ని 18 డిసెంబర్ 2023న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని 20 డిసెంబర్ 2023న లోక్‌సభ ఆమోదించింది. ఆ తర్వాత డిసెంబర్ 21న రాజ్యసభలో ప్రవేశపెట్టబడింది. అదే రోజున రాజ్యసభ కూడా ఆమోదించింది.
అలా చేస్తే భారీగా జరిమానా..
కొత్త చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి పేరుపై గరిష్టంగా 9 సిమ్ కార్డులు రిజిస్టర్ చేసుకొని ఉండవచ్చు. అయితే, జమ్మూ, కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలకు ఈ నిబంధన వర్తించదు. ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు కేవలం 6 సిమ్ కార్డులు మాత్రమే కలిగి ఉండే అవకాశం ఉంది.
ఈ పరిమితికి మించి సిమ్ కార్డులు కలిగి ఉంటే.. సదరు వ్యక్తి తొలిసారి రూ.50వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రెండోసారి కూడా నిబంధన ఉల్లంఘించి పరిమితికి మించి సిమ్ కార్డులు ఉంటే.. రూ.2లక్షల వరకు ఫైన్ చెల్లించాల్సిన ఉంటుంది.
ఇంకా, కొత్త చట్టం ప్రకారం.. ఎవరైనా ఇతరులను మోసగించి, తప్పుడు గుర్తింపు పత్రాలను ఉపయోగించి సిమ్ కార్డును పొందినట్లయితే చర్యలు తప్పవు. తప్పుడు ధ్రువపత్రాలతో సిమ్ కార్డు పొందినట్లు తేలితే గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. లేదా రెండూ విధించవచ్చు.
అలాగే, వినియోగదారు సమ్మతి లేకుండా వాణిజ్య సందేశాలు పంపిస్తే.. సంబంధిత ఆపరేటర్‌కు రూ.2 లక్షల వరకు భారీ జరిమానా ఉంటుంది. అలాగే, భవిష్యత్తులో ఎలాంటి సేవలు అందించకుండా నిషేధానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా, టెలికం కంపెనీలకు మొబైల్ టవర్లను ఇన్‌స్టాల్ చేయడానికి లేదా ప్రైవేట్ ఆస్తులపై టెలికం కేబుళ్లు వేయడానికి ప్రభుత్వం అనుమతిని ఇస్తుంది. ఈ క్రమంలో భూ యజమాని వ్యతిరేకించినప్పటికీ, అధికారులు దీన్ని అవసరంగా విశ్వసించినంత వరకు చేయవచ్చు.
దేశ భద్రత ప్రమాదంలో ఉన్న పరిస్థితుల్లో లేదా అత్యవసర పరిస్థితుల్లో, సందేశాలు, కాల్ పరస్పర చర్యలను నిరోధించడానికి, నియంత్రించడానికి టెలికం సేవను అడ్డగించే అధికారాన్ని కొత్త చట్టం కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుంది.