కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తోంది. దీని కారణంగా.. దేశంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో.. మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. అయితే.. లాక్ డౌన్ సమయంలో.. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే.. వారు పర్మిషన్ తీసుకొని మరీ వెళుతున్నారు. ఓ క్రమంలో ఓ యువకుడు సాయంత్రం సెక్స్ కి వెళ్లాలి.. పాస్ ఇవ్వండి సర్ అంటూ పర్మిషన్ కోరడం గమనార్హం. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం కేరళలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో బయటకు వెళ్లేందుకు కన్నూర్‌లోని కన్నాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ పాస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎందుకోసం వెళ్లాలి? అనే కాలమ్‌లో మనోడు ‘సాయంత్రం సెక్స్‌ కోసం వెళ్లాలి’ (Need To Go For Sex) అని రాశాడు. దీన్ని చూసిన పోలీసులు అసిస్టెంట్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా ఆయన విచారణ చేయమని ఆదేశించాడు. వెంటనే వల్లపట్టణం పోలీసులు అతడిని గుర్తించి విచారించారు. అప్పుడు ఆ వ్యక్తి తాను చేసిన తప్పును చూసి కంగారు పడ్డాడు. తాను తప్పు రాశానని.. ఆరు గంటలకు రాయబోయి సిక్స్‌ బదులు సెక్స్‌ అని రాసినట్లు తెలిపాడు.

చూసుకోకుండా అలా పంపానని పోలీసులకు వివరణ ఇచ్చాడు. మొత్తం వివరాలు తెలుసుకుని అతడు చెప్పింది.. వాస్తవమేనని నమ్మి వదిలేశారు. అతడు క్షమాపణలు చెప్పడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ పాస్‌ రిజిస్ట్రేషన్‌ అవసరం లేకుండా వినియోగించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. సరైన కారణాలు ఉంటేనే పాస్‌లు జారీ చేస్తున్నారు.