ఎంపీల సస్పెన్షన్ లో ఆల్ టైం రికార్డ్... మరి 1989నాటి చరిత్ర రిపీట్ అవుతుందా?
141మంది ఎంపీల సస్పెన్షన్ తో ప్రతిపక్షాలు ఎలాంటి నిర్ణయానికి రానున్నాయి? మూకుమ్మడి రాజీనామాలకు మొగ్గు చూపుతాయా? అలా చేస్తే 1989నాటి హిస్టరీ రిపీట్ అవుతుందా? అధికార పక్షం ఎలా ఎదుర్కోబోతుంది? అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతుంది.
ఢిల్లీ : పార్లమెంటులో భద్రతా లోపంపై మంగళవారం ఉపసభల్లో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. నిన్న 92 మంది ఎంపీలను సస్పెండ్ చేయగా...నేడు లోక్సభలో మరో 49 మంది విపక్ష ఎంపీలపై వేటుపడింది. దీంతో ఇప్పటివరకు 141 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. దీనిమీద ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టడంతో మంగళవారం ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ఈ తాజా సస్పెన్షన్లతో గతంలో ఉన్న సస్పెన్షన్ రికార్డు బద్దలైంది. ఎంపీల సస్పెన్షన్ లో ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలు సరికొత్త రికార్డును సృష్టించాయి. 34 ఏళ్ల అన్ బ్రేకబుల్ రికార్డును అధిగమించింది.
పార్లమెంటులో ఒక్కరోజులోనే ఇంతమంది ఎంపీలు సస్పెండ్ కావడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. సోమవారం నాడు 78 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ముందు డిసెంబర్ 14న 14 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. దీంతో మొత్తం కలిపి 92 మంది ఎంపీలు సస్పెండ్ అయినట్టు.. తాజాగా మంగళవారం మరో 49 మందిని సస్పెండ్ చేశారు. ఇకపోతే 34 ఏళ్ల క్రితం.. 1989లో ఒకేరోజు 63 మంది ఎంపీలు సస్పెన్షన్ కు గురయ్యారు. ఇప్పుడు ఆ రికార్డును నేటి సస్పెన్షన్ అధిగమించింది.
మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పదేళ్లలో 43 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. కానీ, అదే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత…లోక్ సభ రాజ్యసభ స్పీకర్లు సస్పెన్షన్ వేటును ప్రధాన ఆయుధంగా ప్రయోగిస్తున్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో మొత్తంగా 25సార్లు.. 94మంది రాజ్యసభ సభ్యులు, 179 మంది లోక్సభ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. అలా చూస్తే ఇప్పటివరకు సస్పెన్షన్ కు గురైన ఎంపీల సంఖ్య 233.
శబరిమలకు పోటెత్తిన భక్తులు: అయ్యప్ప దర్శనానికి 16 గంటలు
ఇలా పోల్చుకుంటే మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఎంపీల సస్పెన్షన్లు ఎక్కువైనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంతో పోలిస్తే బిజెపి ప్రభుత్వ హయాంలో ఐదు రెట్లు ఎక్కువ మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. సోమవారంనాడు పార్లమెంట్ భద్రతా లోపంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిమీద చర్చించాలని పట్టుబట్టాయి. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రవాగ్వాదం నెలకొంది. ఈ ఒకేసారి 78 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. 1989లో అలా ఒకేరోజు 63 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు.
రాజ్యసభ, లోక్ సభల్లో ఎంతమంది ఉంటారంటే…
రాజ్యసభలో మొత్తం 245 మంది ఎంపీలు ఉంటారు. బీజేపీ దాని మిత్రపక్షాలు 105 మంది ఉండగా, ప్రతిపక్ష భారత్ కూటమి 64 మంది, ఇతరులు 76మంది ఎంపీలు ఉన్నారు. ఇక అలాగే లోక్ సభలో ప్రస్తుత ఎంపీల సంఖ్య 538. ఎన్ డిఏకు 329 మంది ఎంపీలు ఉండగా, భారత్ కూటమికి 142 మంది ఎంపీలు, ఇతర పార్టీలకు 67 మంది ఎంపీలు ఉన్నారు. ఇక నిన్న విపక్షాల చెందిన 46 మంది రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేశారు. అలాగే 46 మంది లోక్సభ ఎంపీలను కూడా సస్పెండ్ చేశారు.
అయితే 1989లో ఒకేరోజు అంత మంది ఎంపీలను సస్పెండ్ చేసింది రాజీవ్ గాంధీ ప్రభుత్వ హయాంలోనే. 1989 మార్చి 15న పార్లమెంటులో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ హత్యపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన జస్టిస్ ఠక్కర్ కమిషన్ నివేదికను సమర్పించారు. అదే సమయంలో బోఫోర్స్ విషయంలో విపక్షాలు రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో ఒకేసారి 63మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఆ సమయంలో లోక్సభ ఎంపీల సస్పెన్షన్ లో ఇదే ఆల్ టైం రికార్డ్ గా మారింది.
కానీ ఈ రికార్డును కూడా 2023 డిసెంబర్ 18న జరిగిన శీతాకాల సమావేశాలు బద్దలు కొట్టాయి. 1989లో సస్పెండ్ అయిన ఎంపీలు స్పీకర్ కు క్షమాపణలు చెప్పడంతో ఒకరోజు తర్వాత సస్పెన్షన్ రద్దు అయింది. అయితే 1989లో లోక్ సభలో సస్పెన్షన్ కు గురి కావడం, అప్పటి యూపీఏ, రాజీవ్ గాంధీ ప్రభుత్వం పార్లమెంటులో భోపోర్స్ కుంభకోణం మీద గళం విప్పడానికి అనుమతింకపోవడంతో.. మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.
ఆ తరువాత లోక్ సభ ఎన్నికల్లో 1989లో కాంగ్రెస్ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఇప్పడూ అలాంటి పరిస్థితే నెలకొన్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ఎలాంటి నిర్ణయానికి రానున్నాయి? మూకుమ్మడి రాజీనామాలకు మొగ్గు చూపుతాయా? అలా చేస్తే 1989నాటి హిస్టరీ రిపీట్ అవుతుందా? అధికార పక్షానికి నష్టం జరుగుతుందా? అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతుంది.