ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు బృహణ్ ముంబై మునిస్పిల్ కార్పోరేషన్ (బిఎంసీ) భారీ షాక్ ఇచ్చింది. ఆమెకు చెందిన పాళి హిల్ భవంతికి బీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతి తీసుకోకుండా బంగళాకు మార్పులు చేర్పులు చేశారని ఆరోపిస్తూ ఆ నోటీసులు జారీ అయ్యాయి. 

ఆ భవంతిని ఆమె మణికర్ణిక కార్యాలయంతో ఆమె నిర్మించుకుంది. తన సొంత కార్యాలయంగా దాన్ని ప్రకటించుకుని అక్కడి నుంచే తన సినిమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. ఆ కార్యాలయాన్ని కూల్చబోతున్నట్లు కంగా ఇప్పటికే ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. 

తన కార్యాలయంలో బీఎంసీ అధికారులు ఉన్నట్లు ఓ వీడియోను ఆమె ట్విట్టర్ లో పోస్టు చేసింది. ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా పోలుస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర ప్రభుత్వానికి తీవ్రమైన ఆగ్రహం తెప్పించాయి. ఆ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే ఆమె కార్యాలయంలో బీఎంసీ అధికారులు ఉండడం గమనార్హం. తన అనుమతి లేకుండా అధికారులు తన కార్యాలయంలోకి వెళ్లారని, కొలతలు తీసుకున్నారని కంగనా ఆరోపించింది. 

 

కంగనా రనౌత్ ముంబై చేసిన వ్యాఖ్యలతో శివసేన అగ్గి మీద గుగ్గిలమైంది. అంతేకాకుండా, సుశాంత్ మృతి కేసులో న్యాయం జరగాలని, ముంబై పోలీసులకు అప్పగించాలని, సీబీఐకి కేసును అప్పగించాలని గతంలో ఆమె అన్నది. ఈ వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా మండిపడ్డారు. 

ముంబైపై, మహారాష్ట్రపై, మరాఠీలపై అతిగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆయన కంగనాను హెచ్చరించారు. దానికి కంగనా కౌంటర్ ఇచ్చింది. తాను సెప్టెంబర్ 9వ తేదీన ముంబైకి వస్తున్నానని, దమ్ముంటే తనను అడ్డుకోవాలని ఆమె సవాల్ విసిరింది. దీంతో శివసేన ప్రభుత్వానికి, కంగనాకు మధ్య వివాదం ముదిరింది.

కంగనా రనౌత్ మణికర్ణిక కార్యాలయం వెలుపల బీఎంసీ అధికారులు నోటీసులు అతికించారు. చట్టవిరుద్ధంగా ఆవరణలో నిర్మాణాలు జరిపినట్లు ఆ నోటీసులో ఆరోపించారు.