కూతురిని చాలా పద్ధతిగా పెంచాలని ఓ తండ్రి తాపత్రయపడ్డాడు. కానీ ఆ తండ్రి తాపత్రయాన్ని కూతురు అర్థం చేసుకోలేకపోయింది. తండ్రి సంప్రదాయ కట్టుబాట్లు ఆమెకు ఆంక్షల్లా అనిపించాయి. దీనికి తోడు టిక్ టాక్ మోజు ఎక్కువైంది.  తాను టిక్ టాక్ లో ఎంతగానో అభిమానించే ఓ వ్యక్తిని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటోంది. దానికి తండ్రి అంగీకరించడు. అందుకే ఇంట్లో నుంచి పారిపోయింది. వెళ్లేముందు తాను లేచిపోవడం లేదని తల్లికి లేఖ రాసి మరీ వెళ్లిపోవడం విశేషం. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ‘మమ్మీ నేను ఇంటిని వదిలి వెళ్తున్నాను. నాన్న పద్ధతి, సంప్రదాయాలు నన్ను తీవ్రంగా బాధపెట్టాయి. నా గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. నేను ఇంటి నుంచి వెళ్లాననే కారణంతో నీవు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా ఆ దేవుడు నీకు ధైర్యాన్ని ఇవ్వాలి. నేను ఓ అబ్బాయితో వెళ్లిపోయానని అనుకుంటే మాత్రం నువ్వు కూడా తప్పుగా ఆలోచించినట్టే. నేను లేచిపోవట్లేదు. ఇంటి నుంచి వెళ్లిపోతున్నా అంతే!’ అని లేఖ రాసి 14ఏళ్ల బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

ఆ లేఖ ఆధారంగా తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కాగా... వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేవలం 8గంటల్లో బాలిక ఆచూకీని కనుగొన్నారు.  అయితే ఆ అమ్మాయికి నేపాల్‌కు చెందిన 16 ఏళ్ల కుర్రాడు, టిక్‌టాక్‌ స్టార్‌ రియాజ్‌ అఫ్రీన్‌ అంటే ఇష్టమని, అతన్ని కలవడానికే వెళ్లిందని స్నేహితురాళ్లు ఇచ్చిన క్లూతో పోలీసులు ఆ అమ్మాయిని గుర్తించి తీసుకొచ్చారు. 

తన తండ్రి కనీసం అబ్బాయిలతో మాట్లాడటానికి, స్నేహం చేయడానికి కూడా అంగీకరించడని... అందుకే తాను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు బాలిక చెప్పడం విశేషం.