టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన భార్య, మోడల్ హసీన్ జహాన్ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనకు ఎదురవుతున్న వేధింపుల గురించి ఆదివారం ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే... ప్రతిష్టాత్మక అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రధాని మోడీ ఆగస్టు 5న శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని హసీన్ తన సోషల్ మీడియా ద్వారా ‘‘ హిందువులందరికీ శుభాకాంక్షలు’’ అంటూ విష్ చేశారు. దీంతో కొందరు నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు.

అత్యాచారం చేసి, చంపేస్తామంటూ అసభ్యకర రీతిలో కామెంట్లు చేస్తూ బెదిరింపులకు దిగారు. ఇది చాలా దురదృష్టకరమని.. ప్రస్తుత పరిస్థితుల్లో తన రక్షణ, తన కుమార్తె భవిష్యత్ గందరగోళంలో పడిపోయిందని, తాను నిస్సహాయురాలినై పోయానని జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అభద్రతా భావం వెంటాడుతోందని, ఇది ఇలాగే కొనసాగితే మానసికంగా కుంగుబాటుకు లోనయ్యే పరిస్థితులు తలెత్తాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దినదినగండంగా బతుకుతున్నానని, కుమార్తెతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నానని... తనను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా హసీన్ జహాన్ కోల్‌కతా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసుకు సంబంధించి ఇంత వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని, విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఇక షమీ తనను హింసిస్తున్నాడని, చంపేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడంటూ హసీన్ గతంలో సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.