దేశంలో చిన్నారులపై కామాంధుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ కతువా లో ఆసిఫా అనే 8 ఏళ్ల చిన్నారి గ్యాంగ్ రేప్ తో పాటు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగి కేంద్ర ప్రభుత్వం తో పాటు రాషట్ర ప్రభుత్వాలు ఇలాంటి దుర్ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకున్నారు. అయినా చిన్నారులపై దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్  లో ఓ చిన్నారిపై 10 మంది యువకులు దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బులంద్‌శహర్‌ జిల్లా చాచేరి గ్రామానికి ఓ చిన్నారి(15) కుటుంబ సభ్యులతో కలిసి ఓ ఎంగేజ్‌మెంట్‌ కు వెళ్లింది. అయితే  బాలికకు దగ్గర్లోని గుడిని చూపిస్తామని మాయమాటలు చెప్పి ఇద్దరు యువకులు బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్ళారు. అయితే వారు బాలికను గుడికి కాకుండా ఓ పంట పొలంలోకి తీసుకెళ్లారు. అక్కడ మరో ఎనిమిదిమందితో కలిసి బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.

అయితే తమ కూతురు కనిపించకపోవడంతో వెతికిన తల్లిదండ్రులకు పొలంలో తీవ్ర గాయాలతో స్పృహతప్పి పడివున్న బాలిక కనిపించింది. దీంతో వారు వెంటనే బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీంతో స్పృహలోకి వచ్చిన బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది.  వారు తమ కూతురిపై జరిగిన దారుణం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.