మహారాష్ట్ర టు ఒడిశా: ఇంటిని చేరేందుకు 1700 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన వలస కూలి
చాలా మంది వలసకూలీలు ఈ లాక్ డౌన్ దెబ్బకు తమ సొంత గ్రామాలను చేరుకోవడానికి కాలినడకన వందల కిలోమీటర్లు పయనమైన విషయం మనందరికీ తెలిసిందే. ఇలానే మహారాష్ట్రలో వలస కార్మికుడిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి, సైకిల్ మీద మహారాష్ట్ర నుంచి ఒరిస్సాలోని తన సొంత ఊరికి పయనమయ్యాడు, చేరుకున్నాడు.
కరోనా వైరస్ దెబ్బకు దేశమంతా లాక్ డౌన్ లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ వల్ల వేరే ప్రాంతాల్లో పనికోసం వెళ్లిన వలస కూలీలు చిక్కుబడిపోయారు. వారంతా ఈ లాక్ డౌన్ వల్ల తమ పనులు చేసుకోలేక, కొద్దిమందికి ఏకంగా తిండి దొరక్క.... వారంతా తమ సొంత ఊర్ల బాట పట్టారు.
చాలా మంది వలసకూలీలు ఈ లాక్ డౌన్ దెబ్బకు తమ సొంత గ్రామాలను చేరుకోవడానికి కాలినడకన వందల కిలోమీటర్లు పయనమైన విషయం మనందరికీ తెలిసిందే. ఇలానే మహారాష్ట్రలో వలస కార్మికుడిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి, సైకిల్ మీద మహారాష్ట్ర నుంచి ఒరిస్సాలోని తన సొంత ఊరికి పయనమయ్యాడు, చేరుకున్నాడు.
ఈ లాక్ డౌన్ వల్ల తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులు కూడా అయిపోతున్నాయి, ఇక అక్కడ బ్రతకలేను అని నిశాచయించుకున్న తరువాత అక్కడి నుండి ఒరిస్సాలోని తన సొంత ఇంటికి పయనమయ్యాడు.
ఏకంగా 1700 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ కేవలం వారం రోజుల్లో ఒరిస్సాలోని తన సొంత ఊరుకు చేరుకున్నాడు. తన కొడుక్కోసం 1400 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణించిన తెలంగాణ మహిళ ఉదంతానికి ఏమాత్రం తీసిపోకుండా ఈ యువకుడి ప్రయాణం సాగింది.
మహారాష్ట్రలోని సాంగ్లీలోని ఒక కర్మాగారంలో 15,000 రూపాయల నెలసరి జీతానికి ఒరిస్సాకు చెందిన మహేష్ అక్కడ పనిచేస్తున్నాడు. ఇంతలోనే లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ విధించేనాటికే నెలాఖరు అవడంతో డబ్బులు అప్పటికే నిండుకున్నాయి. అయినా ఎలాగోలా నెట్టుకొస్తున్నాడు.
ఉన్న కొద్దిపాటి డబ్బులు కూడా అయిపొవస్తుండడం, పరిశ్రమలు మరో మూడు నెలలు తెరుచుకోవు అనే పుకార్లు వినిపిస్తూ ఉండడంతో అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. మరో నెలరోజులపాటు అక్కడే ఉండడానికి అతడికి కనీసం 6వేల రూపాయలు అవసరమవుతాయి. అతడి వద్ద మిగిలింది కేవలం 3000 రూపాయలు మాత్రమే. ఇక చేసేదేమి లేక ఇంటికి వెళ్లడం ఒక్కటే మార్గంగా నిశ్చయించుకున్నాడు.
అతడు తన ప్రయాణాన్ని ప్రారంభించేముందు అతడి వద్ద మ్యాప్ లాంటిదేమీ లేదు. రైల్లో ప్రయాణం చేసినప్పుడు స్టేషన్ పేర్లు గుర్తుండడం తప్ప అతడికి వేరే ఎలాంటి అవగాహనా లేదు. కానీ ఇంటికి వెళ్లాలనే బలమైన కోరిక మాత్రమే ఉంది.
అతడి గ్రామానికే చెందిన కొందరు అతడిని వారించారు కూడా. అయినా అతడు వినిపించుకోకుండా తనప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తెల్లవారక ముందే సైకిల్ తొక్కడం మొదలు పెట్టేవాడు. అలా మధ్యాహ్నం కల్లా ఏదైనా ధాబా చూసుకొని, అక్కడ ఒక ముద్ద తిని ఒక కునుకు తీసి మరల తన ప్రయాణాన్ని మొదలుపెట్టేవాడు.
సోలాపూర్, హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం మీదుగా ఒరిస్సాలోని జాజ్ పూర్ చేరుకున్నాడు. రాత్రిళ్ళు బడి కానీ, దేవాలయం కానీ ఏదైనా సురక్షితమైన ప్రాంతంలో నిద్రించి తెల్లవారుఝామున సూర్యోదయానికి ముందే తన ప్రయాణాన్ని ప్రారంభించేవాడు. రాష్ట్ర సరిహద్దుల్లో, చెక్ పోస్టుల వద్ద అతడిని అధికారులు ప్రశ్నించినప్పటికీ... తన ప్రయాణం గురించి చెప్పి వారిని కన్విన్స్ చేయగలిగాడు.
రోజుకు 16 గంటల పాటు సైకిల్ తొక్కుతూ తన ప్రయాణాన్ని సాగించాడు ఈ యువకుడు. ఇలా ప్రయాణించి చిట్టచివరకు ఏప్రిల్ 7వ తేదీన ఈ కుర్రాడు తన సొంత గ్రామానికి చేరుకున్నాడు. కానీ ఆసుపత్రిలో చెకింగ్ లేకుండా ఊర్లోకి రానివ్వబోమని గ్రామస్తులంతా చెప్పడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారు అతడిని క్వారంటైన్ కి తరలించారు.
వారం రోజులపాటు సాగిన కఠోరమైన సైకిల్ ప్రయాణం అక్కడ లాక్ డౌన్ కాలంలో గడిపిన ఒంటరి జీవితం కన్నా ఎంతో సంతోషాన్నిచ్చిందని ఈ కుర్రాడు అంటున్నాడు. రేపో మాపో ఆ కుర్రాడి క్వారంటైన్ కాలం పూర్తవుతుంది.