లూథియానా: ఓ వ్యక్తి తన భార్య పట్ల అసహ్యకరమైన రీతిలో వ్యవహరించాడు. బాత్రూంలో స్పై కెమెరా అమర్చి, దాంతో భార్య స్నానం చేస్తుండగా వీడియోలు, ఫోటోలు తీశాడు. వాటిని చూపించి డబ్బుల కోసం ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడు. ఈ సంఘటన పంజాబ్ లోని లూథియానాలో జరిగింది. 

భర్త తనను బ్లాక్ మెయిల్ చేస్తుండడంతో ఆ 23 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన స్నానాల గదిలో తనకు తెలియకుండా కెమెరాలు అమర్చాడని, వాటితో అభ్యంతకరమైన పోటోలూ వీడియోలూ తీశాడని, వాటిని చూపించి రూ.20 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించింది. 

డబ్బులు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె చెప్పింది. రహస్యంగా తీసిన ఫొటోల్లో కొన్నింటిని తన భర్త వాట్సప్ స్టేటస్ లో కూడా పెట్టాడని ఆమె చెప్పింది. ఇందులో తన అత్తామామల పాత్ర కూడా ఉందని ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. 

ఇదిలావుంటే, మహారాష్ట్రలోని థానేలో మరో ఘోరం జరిగింది. తన భార్యను ఓ వ్యక్తి దారుణంగా పొడిచి చంపాడు. తన ప్రేయసితో నగ్నంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతను ఆ దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడిని రఫీక్ మహ్మద్ యూనిస్ గా గుర్తించారు. భార్యను చంపిన తర్వాత అతను పోలీసులకు లొంగిపోయాడు.