ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్‌పై నాలుగేళ్ల క్రితం అత్యాచారం చేసిన ఓ కామాంధుడు.. బెయిల్‌పై విడుదలై బాధితురాలిని, ఆమె తల్లిని హతమార్చాడు.

వివరాల్లోకి వెళితే.... కస్గంజ్ జిల్లాకు చెందిన యశ్‌వీర్ అనే వ్యక్తి తన పొరుగింట్లో ఉండే బాధితురాలి కుటుంబంతో సన్నిహితంగా మెలిగేవాడు. వారితో కలివిడిగా ఉంటూ కుటుంబంలో ఒకడిగా మెదిలేవాడు.

ఈ నేపథ్యంలో 2016లో 13 ఏళ్ల బాలికైన బాధితురాలిని కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యశ్‌వీర్‌ను అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు.

తనను జైలుకు పంపడంపై ఆగ్రహంతో రగిలిపోయిన నిందితుడు 2017లో బెయిల్‌పై బయటకు వచ్చిన యశ్‌వీర్ ఎలాగైనా బాధితురాలి కుటుంబంపై పగ తీర్చుకోవాలని భావించాడు. దీనిలో భాగంగా మంగళవారం సాయంత్రం సైకిలుపై ఇంటికి వస్తున్న తల్లీకూతుళ్లపై ట్రాక్టర్ ఎక్కించాడు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అతడిని అరెస్ట్ చేసి హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. కాగా గత నాలుగేళ్లుగా ఇరు కుటుంబాల మధ్య వైరం వుందని, పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు.

నగదుకు సంబంధించిన విషయంలో యశ్‌వీర్ తండ్రికి, బాధితురాలి తండ్రికి మధ్య జరిగిన గొడవలో నిందితుడి తండ్రి మరణించాడని అధికారులు పేర్కొన్నారు. దీంతో యశ్‌వీర్.. బాధితురాలి తండ్రిపై ఫిర్యాదు చేయగా, అతడిని అరెస్ట్ చేశామని, 2018లో అతడు జైలు నుంచి విడుదలైనట్లు తెలిపారు.