ఇంతకుముందు ఎవరన్నా ఆట ఆడుతూ మృతి చెందారంటే...అది ఏ అవుట్ డోర్ గేమ్ అయి ఉండేది. ఈ మధ్యకాలంలో సాంకేతికత బాగా ముందుకెళ్లి మనుషులను పరాన్న జీవులుగా మారుస్తుంది. 

మనుషులకు ఇప్పుడు అంతర్జాలం, సాంకేతికత అనేవి వ్యసనాలుగా మారాయి. గేమింగ్ రంగం నూతన పుంతలు తొక్కుతుండడంతో అందరూ బయట ఆడే గేమ్స్ ని వదిలేసి ఇంట్లో ఆన్ లైన్ గేమ్స్ ఆడేస్తున్నారు. 

ఇలా ఆడడం వరకు బాగానే ఉంటుంది. కొందరేమో దానికి వ్యసనపరులుగా మారిపోతున్నారు. పబ్ జీ ఇప్పుడు ప్రస్తుతానికి టాప్ ప్లేస్ లో ఉన్న వ్యసనం. తాజాగా ఇలానే ఈ వ్యసనానికి ఒకరు బలయ్యారు కూడా. 

Also read: సల్మాన్ మామూలోడు కాడు: పబ్జీ గేమ్ తో అమ్మాయిలను లోబరుచుకుని...

ఆన్‌ లైన్‌ గేమ్‌ పబ్‌ జీకు వ్యవసపరుడిగా మారి.. ఓ యువకుడు ఏకంగా ప్రాణాల్ని కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రంలోని పూణేకు చెందిన హర్షల్‌ (27) గత రెండేళ్లుగా పబ్జీకి వ్యసనపరుడిగా మారాడు. 

ఏ పనీపాటు లేకుండా 24 గంటలూ ఆదే ఆటలో మునిగితేలడం మొదలుపెట్టాడు. ఇలా ఒక్కచోటనే కూర్చొని ఉండిపోవడంతో... గత గురువారం ఇతడికి తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. 

కుటుంబ సభ్యులు హుటాహుటిన అతన్ని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం అక్కడే కన్నుమూశాడు. 

అయితే హర్ట్‌ ఎటాక్‌తో పాటు ఒకేసారి అతనికి బ్రైయిన్‌ స్ట్రోక్‌ కూడా వచ్చిందని,  దానివల్ల అతని మెదడులోని కణజాలం చిట్లి తీవ్ర రక్తస్రావం అయిందని, దీంతో హర్షల్‌ మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. 

కుమారుడు మృతిపై అతని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. విపరీతంగా పబ్‌జీ ఆడటంమూలంగానే తమ కుమారుడు మృతిచెందాడని బోరుమంటున్నారు. 

గతంలో తెలంగాణాలో కూడా ఇలాంటిదే ఒక సంఘటన జరిగింది. ఆ ఆటకు వ్యసనపరుడిగా మారి ఒక కుర్రాడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. వనపర్తి జిల్లాకు చెందిన కేశవర్థన్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తల్లితో కలిసి వుంటున్న ఈ కుర్రాడు దాదాపు నెల రోజుల నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా సెల్‌ఫోన్‌లో పబ్‌జీ గేమ్ ఆడుతూనే ఉన్నాడు.

Also read: నెల రోజులుగా.. నిద్రాహారాలు మాని పబ్‌‌జీ: పడిపోయిన కాలు, చేయి

రాత్రిపూట దుప్పటి కప్పుకుని మరి ఆడుకోవడంతో.. పిల్లాడు పడుకున్నాడు కదా అని తల్లి అనుకునేది. చివరికి భోజనానికి రమ్మన్నా వద్దు అనేవాడు. అయితే సమయానికి మంచినీరు, ఆహారం తీసుకోకపోవడంతో కేశవర్ధన్ అరోగ్యం తీవ్రంగా క్షీణించింది.

వారం క్రితం జ్వరంతో పాటు వాంతులు రావడంతో కంగారుపడిన తల్లి కుర్రాడిని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయినప్పటికీ రెండు, మూడు రోజులు జ్వరం తగ్గలేదు. చివరికి మెదడుపై తీవ్ర ఒత్తిడి పడి పరిస్ధితి విషమంగా మారింది.

కుడికాలు, కుడి చేయి కదపలేని స్ధితికి చేరడంతో కేశవర్థన్‌ను సికింద్రాబాద్‌లోని సన్‌షైన్ ఆసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యుల బృందం.. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి కారణంగా శరీరంలో సోడియం, పోటాషియం నిల్వలు తగ్గి మెదడుపై పెను ప్రభావం చూపిందని వైద్యులు తేల్చారు.

మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నరాల్లో అడ్డంకులు ఏర్పడినట్లు గుర్తించారు. చికిత్స అనంతరం యువకుడిని డిశ్చార్జి చేసిన వైద్యులు పబ్‌జీతో పాటు ఎలాంటి వీడియో గేమ్ ఆడకుండా చూడాలని కేశవర్ధన్ తల్లికి చెప్పి పంపారు.