రోజురోజుకూ మానవత్వం మంట గలిసిపోతోంది. వావివరసలు మరిచి మగాడు మృగాడుగా మారుతున్నాడు. మగాడన్న ఒక్క కారణంతో తల్లి,చెల్లి, వదినా, కూతురు అనే వరుసలు మరిచి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. 

కడుపున పుట్టిన కూతుర్ని కళ్లలో పెట్టి పెంచుకోవాల్సిన తండ్రే కీచకుడిగా మారాడు. పదేళ్ల పసిదని కూడా చూడకుండా అకృత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా తన స్నేహితులతో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఘటన తమిళనాడులోని టీ నగర్ లో కలకలం రేపింది. స్నేహితులతో కలిసి కన్నకూతురిపైనే సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఆ తండ్రికి న్యాయస్థానం 60 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతనితో పాటు లైంగికదాడికి పాల్పడిన అతని స్నేహితులకు 40 ఏళ్ల జైలుశిక్ష విధించింది. 

ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా గోబి సమీప గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెడితే ...గ్రామానికి చెందిన పదేళ్ల చిన్నారి, తండ్రి, తమ్ముడితోపాటూ నివసిస్తోంది. కాగా తండ్రి పెట్టే చిత్రహింసలు భరించలేక తల్లి ఎటో వెళ్లిపోయింది. 

తల్లిలేని పిల్లను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ కీచకతండ్రి 2019లో తన స్నేహితులైన అరుణాచలం (35), మణికంఠన్(33)లతో కలిసి బాలిక మీద సామూహిక లైంగిక దాడికి తెగబడ్డాడు. 

విషయం తెలుసుకున్న స్థానికులు వీరి మీద గోబి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్ట్ చేశారు. ఈ కేసును ఈ రోడ్ జిల్ల మహిళా కోర్టు విచారణ జరిపింది. బుధవారం న్యాయమూర్తి మాలతి ఈ కేసులో తీర్పును వెలువరించారు. 

ఘాతుకానికి పాల్పడిన  బాలిక తండ్రికి మూడు సెక్షన్ల కింద 20 ఏళ్ల చొప్పున 60 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అలాగే, మిగతా ఇద్దరికీ రెండు సెక్షన్ల కింద 40 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.