టెక్నాలజీ సాయంతో మహిళలు, యువతులను వేధిస్తున్న కిలాడీల సంఖ్య ఈ మధ్యకాలంలో పెరుగుతోంది. వీరిని ఎంత కఠినంగా శిక్షిస్తున్నా... మార్పు మాత్రం రావడం లేదు. తాజాగా ఇతరుల ఫోన్లకు నగ్న చిత్రాలను పంపుతూ వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు.

వివరాల్లోకి వెళితే..  కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలో ప్రాంతంలోని చల్లకెరేకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి గత కొద్ది నెలలుగా ఇతరుల ఫోన్లకు నగ్న చిత్రాలను పంపుతూ వేధింపులకు పాల్పడుతున్నాడు.

ఇలా దాదాపు 200 మందికి నగ్న చిత్రాలను పంపించాడు. వీరిలో 120 మంది మహిళలు ఉండటం ఆశ్చర్యకరం. అతని వేధింపులు భరించలేక చల్లకెరేకు చెందిన చాలా మంది దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న వారు దర్యాప్తు చేపట్టారు.

అయితే విషయం తెలుసుకున్న రామకృష్ణ అత్యంత చాకచక్యంగా వ్యవహరించాడు. తన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌లో పెట్టడంతో అతడ్ని కనుక్కోవటం పోలీసులకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో శుక్రవారం అతను ఫోన్‌ ఆన్‌ చేయటంతో ట్రేసింగ్‌ ద్వారా ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

రామకృష్ణను విచారించగా చేసిన నేరం ఒప్పుకున్నాడు. అయితే తాను ఫోన్‌ రింగ్‌ అయిన నెంబర్లకు మాత్రమే ఫొటోలు పంపుతానని చెప్పాడు. ఈ నేపథ్యంలో చాలా మంది మహిళలను వారి నగ్న చిత్రాలు పంపమంటూ వేధించానని తెలిపాడు.